నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా `డాకు మహారాజ్` సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రొటీన్ కథే అయినప్పటికీ.. స్క్రీన్ ప్లే, బాలయ్య యాక్టింగ్, ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్, థమన్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టాక్ అనుకూలంగా రావడానికి తోడు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద డాకు కలెక్షన్స్ ను ఊచకోత కోస్తోంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ లెక్కలు బయటకు వచ్చాయి.
ఓవైపు గేమ్ ఛేంజర్, మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం వంటి పెద్ద సినిమాలు ఉన్నా కూడా డాకు మహారాజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తోంది. మూడు రోజుల రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం ఏపీ మరియు తెలంగాణలో రూ. 9.02 కోట్ల షేర్, రూ. 14.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 25.72 కోట్ల షేర్ రాబట్టిన డాకు.. 2వ రోజు రూ. 9.61 కోట్లు, 3వ రోజు రూ. 9.02 కోట్ల షేర్ వసూల్ చేసి దుమ్ము దులిపేసింది.
వరల్డ్ వైడ్గా చూసుకుంటే బాలయ్య తాజా చిత్రం మూడు రోజుల్లో రూ. 54.30 కోట్ల షేర్, రూ. 87.85 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఓవర్సీస్లోనే దాదాపుగా రూ. 6.85 కోట్ల షేర్ వచ్చింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 66 శాతం రికవరీ అయింది. ఇంకా రూ. 27.70 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే.. బాలయ్య ఖాతాలో వరుసగా డాకు రూపంలో నాలుగో హిట్ పడటం ఖాయమవుతుంది.