ఎలాంటి అక్రమాలు జరగకుండా సార్వత్రిక ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన ‘సి విజిల్’ యాప్ ద్వారా సామాన్య ప్రజలను కూడా భాగస్వామ్యం చేసింది. ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన నాయకుల పని పట్టేందుకు దీనిని మంత్రదండంలా ఉపయోగించుకోవచ్చు. మరి ఆ యాప్ ఎలా పనిచేస్తుందో, దానిలో పౌరులు ఎలా భాగస్వాములు కావొచ్చో తెలుసుకుందాం.
ఐదు నిమిషాల్లోనే స్పందన
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచే ‘సి విజిల్’ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలు సహా ఈ యాప్‌లో పొందుపరచవచ్చు. ఉల్లంఘనలను ఫొటో, వీడియో, ఆడియో రూపంలో రికార్డు చేసి యాప్‌లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేస్తే ఐదు నిమిషాల్లోనే ఎన్నికల అధికారులు స్పందిస్తారు. విచారణ చేపట్టి వంద నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటారు. ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు. ‘సి విజిల్’ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. మన ఫోన్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలాంటి ఫిర్యాదులు చేయొచ్చు?
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా అనిపించిన ప్రతిదానిని ఫిర్యాదు చేయవచ్చు. అంటే.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంపకం, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం వంటి ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా అందుకు సంబంధించిన వీడియోనో, ఫొటోనో, ఆడియోను రికార్డు చేసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు.
దేనికదే ప్రత్యేక ఆప్షన్
యాప్ ఓపెన్ చేయగానే ఫొటో, వీడియో, ఆడియో ఆప్షన్లు కనిపిస్తాయి. మనం ఎలా ఫిర్యాదు చేయాలనుకున్నామో అందుకు తగ్గ ఆప్షన్‌ను ఎంచుకుని అందుకు తగిన ఆధారాన్ని అప్లోడ్ చేయాలి. దాంతోపాటు రాష్ట్రం, నియోజకవర్గం వంటి వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన ఎలాంటిదో రెండుముక్కల్లో చెప్పాల్సి ఉంటుంది.
ఐదంటే ఐదు నిమిషాల్లోనే రంగంలోకి
ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే అధికారులు రంగంలోకి దిగుతారు. ఫిర్యాదును ఫీల్డ్ ఆఫీసర్‌కు పంపుతారు. వారు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఫిర్యాదుపై విచారణ జరిపి అరగంటలోనే వివరాలు సేకరించి ఎన్నికల అధికారికి నివేదిస్తారు. ఆయన దానిపై 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. మొత్తంగా 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటారు. అంతేకాదు, మన ఫిర్యాదు స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఉంది. అక్రమాలకు పాల్పడే అరాచక శక్తుల ఆట కట్టించేందుకు ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరింది.