2022లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు విరుచుకుపడి విధ్వంసం సృ ష్టించిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం జగన్ను.. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. `నా కొడుకు` అంటూ దూషించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన.. వైసీపీ నాయకులు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ వీరంగం వేశారు. ఈ క్రమంలోనే మంగళగిరి పార్టీ ఆఫీసుపై దాడి చేసి.. అద్దాలు.. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
అయితే.. అప్పట్లో కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడంతో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు.. జిల్లా పోలీసులు తూతూ.. మంత్రంగా ఎఫ్ ఐఆర్ కట్టారు. తర్వాత.. ఈ కేసు మరుగున పడిపోయింది. తాజాగా కూటమి సర్కారు రావడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. ఈ ఘటన వెనుక బాధ్యులు ఎవరు ఉన్నా.. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఏడుగురు ఈ విధ్వంసంలో పాల్గొన్నట్లు నిర్దారణ చేసుకున్నారు.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. అదేవిధంగా విజయవాడకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్ హస్తం కూడా ఉందని, ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా.. ఈ ధ్వంస రచనలో భాగస్వామ్యం పంచుకున్నారని నిర్ధారించారు. దీంతో 150 మందిపై కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరిలో గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు, చెందిన వారే ఎక్కువ మంది దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు.
దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు… వైసీపీ నాయకులు అవినాష్, ఎమ్మె ల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని అరెస్టు చేసే విషయంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పైనుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం.. వీరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వైసీపీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.