సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైలు బోగీల దహనం కేసులో డిఫెన్స్ అకాడమీల ప్రతినిధుల ప్రధాన దోషులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణాలో ఉన్న 16 డిఫెన్స్ అకాడమీ శిక్షణా సంస్ధల ప్రతినిధులే అభ్యర్ధులను బాగా రెచ్చగొట్టి రైల్వేస్టేషన్ పై దాడులు జరిపించినట్లు బయటపడింది. అల్లర్లలో కీలకపాత్ర పోషించిన వారిలో ఇప్పటికి పోలీసులు 56 మందిని అరెస్టుచేశారు. కొన్నివందల మందిని అదుపులో తీసుకున్నారు.
ఇంకా కొన్ని వందలమంది కోసం గాలిస్తున్నారు. అలాగే విధ్వంసంలో కీలకపాత్ర పోషించిన వారిలో కొందరు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పై జరిగిన దాడిలో సుమారు 3 వేలమంది పాల్గొన్నట్లు ఇప్పటికి పోలీసులు తేల్చారు. ఈ అల్లర్లలో ప్రధానపాత్ర ఉన్న వారిని విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.
ఇపుడు అల్లర్లలో పాల్గొన్నవారిలో 2 వేలమంది రెండేళ్ళక్రితం నిర్వహించిన ఆర్మీ పరీక్షల్లో అర్హత సాధించారు. ఇలాంటివారిని అకాడమీలు బాగా రెచ్చిగొట్టాయట. ఇపుడు గనుక అగ్నిపథ్ పథకాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తుల్లో ఎప్పటికీ సైన్యంలో చేరలేరని భయపెట్టినట్లు అరెస్టయిన వారే చెప్పారు. బీహార్, రాజస్ధాన్లో రైళ్ళను తగలబెట్టినట్లే సికింద్రాబాద్ లో కూడా చేయాలని ప్లాన్ చేశారట. అయితే అలా సాధ్యంకాకపోవటంతో బోగీలను తగలబెట్టి, ఆస్తులను ధ్వంసంచేశారు.
మొత్తానికి అరెస్టయిన వారిద్వారా అకాడమీల్లో తమను రెచ్చగొట్టిన వారి వివరాలను, మొబైల్ ఫోన్లను పోలీసులు తీసుకున్నారు. వీరిలో కొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. అకాడమీ ప్రతినిధులే అభ్యర్దుల మధ్య వాట్సప్ గ్రూపులు ఏర్పాటుచేసి ఏమేమి చేయాలో డైరెక్షన్లిచ్చారట. ఇపుడు పట్టుబడినవారిలో ఆర్మీ ప్రవేశాలు కోరుకుంటున్న అభ్యర్ధులే కాకుండా పోలీసు డిపార్టుమెంటులో ప్రవేశించాలని అనుకుని శిక్షణ తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు.
ఆర్మీ, పోలీసు శాఖల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నవారే ఇపుడు పోలీసు కేసుల్లో బుక్వవటం గమనార్హం. మరీ కేసుల నుండి వీళ్ళంతా ఎప్పటకి బయటపడతారు ? ఒకవైపు జరిగిన ఘటనతో తమపిల్లలకు ఎలాంటి సంబంధంలేదని వాళ్ళ తల్లి,దండ్రులు లబోదిబో మంటున్నారు. చూస్తుంటే అరెస్టయిన వారి భవిష్యత్తు అంధకారమయ్యేట్లే ఉంది