దుర్గా ఆర్ట్స్ బేనర్ మీద ఒకప్పుడు ‘హలో బ్రదర్’, ‘సంతోషం’ సహా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాత కేఎల్ నారాయణ. ఐతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2006లో ‘రాఖీ’ చిత్రాన్ని నిర్మించాక ఆయన ప్రొడక్షన్‌కు దూరం అయిపోయారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఒక మెగా మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎప్పుడో తనకు ఇచ్చిన హామీని రాజమౌళి ఇప్పుడు నెరవేర్చబోతుండటంతో ఆయన పంట పండబోతోంది.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీయబోయే పాన్ వరల్డ్ మూవీని దుర్గా ఆర్ట్స్ బేనర్లో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు నారాయణ. ఐతే ఈ సినిమాకు నిర్మాతగా నారాయణ నామమాత్రం అని.. జస్ట్ డబ్బులు పెట్టడం వరకే ఆయన పని అని.. ప్రొడక్షన్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారాన్ని ఖండిస్తూ మహేష్-రాజమౌళి సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు నారాయణ.
‘‘నేను నిర్మాతగా ఉద్దేశపూర్వకంగా విరామం తీసుకోలేదు. అనుకోకుండా వచ్చింది. మహేష్-రాజమౌళి సినిమాను 15 ఏళ్ల కిందటే ఫిక్స్ చేశాం.
ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్ వేరే స్థాయిలో ఉంది. అయినా గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్‌లో సినిమా చేస్తున్నట్లు వాళ్లే ప్రకటించారు. అందుకే వాళ్లకు రుణపడి ఉంటాను. రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయినా కాదనుకుని నాకు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు నెలలుగా ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నిర్మాతలు కథా చర్చల్లో పాల్గొనరనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అది అందరి విషయంలో నిజం కాదు. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటారు. ఏమైనా సందేహం ఉంటే చెప్పమని అడుగుతారు.
చిన్న పాయింట్ కూడా ఆయన ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో దగ్గర్నుంచి చూస్తున్నా. ఈ సినిమా కోసం మహేష్ తనను తాను కొత్తగా మలుచుకుంటున్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబరులో చిత్రీకరణ మొదలవుతుంది. కథ చాలా బాగుంది. బడ్జెట్ ఎంత అన్నది నిర్ణయించలేదు. కానీ ప్రాడక్ట్‌కు ఎంత అవసరమో అంతా పెట్టడానికి సిద్ధం’’ అని నారాయణ పేర్కొన్నారు.