ఓ స్థలం వివాదంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన తనయుడు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు నమోదు కావడం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో స్థలం నుంచి ఖాళీ చేయించారని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఖాళీ చేయకుంటే అంతు చూస్తామని సురేష్ బాబు తమను బెదిరించారని ప్రమోద్ ఆరోపించారు.
గతంలో ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రమోద్ కోర్టును ఆశ్రయించడంతో వారిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అంతేకాదు,విచారణకు రావాలని సురేష్ బాబు, రానాకు సమన్లు జారీ చేసింది.
ఫిలింనగర్లోని కో-ఆపరేటివ్ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేష్ బాబు తమను మోసం చేశారని కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
డబ్బు తీసుకుని స్థలం రిజిస్ట్రేషన్ చేయడం లేదని బంజారా హిల్స్ పోలీసులకు ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రమోద్ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సురేష్ బాబు, రానా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది.
1000 గజాల స్థలాన్ని సురేష్ బాబు కుటుంబం 2014లో హోటల్ ఏర్పాటు కోసం ప్రమోద్ కుమార్ కు లీజుకిచ్చింది. 2018 ఫిబ్రవరిలో లీజు ముగియడంతో ఆ స్థలాన్ని రూ.18 కోట్లకు అమ్మేందుకు సురేష్ బాబు ఒప్పుకున్నారు. దీంతో, రూ.5 కోట్లు చెల్లించి ప్రమోద్, ఇతరులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదని ప్రమోద్పై సురేష్ బాబు కేసు వేశారు. స్థలాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు.