టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన అనంతరం.. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన టీమిండియా క్రికెటర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. దుబాయ్ నుంచి ముంబయికి వచ్చిన సందర్భంగా తాను తీసుకొచ్చిన ఖరీదైన వాచ్ లను కస్టమ్స్ అధికారులకు చూపించటం.. వాటిని వారు సీజ్ చేశారన్న వార్తలు జోరందుకున్నాయి. అన్నింటికి మించి.. హార్దిక్ తీసుకొచ్చిన రెండు వాచ్ ల విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుందన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. తనపై వస్తున్న వార్తల్ని హార్దిక్ ఖండిస్తున్నారు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్న ఆయన.. తానే స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకెళ్లి.. సుంకం చెల్లిస్తానని చెప్పినట్లుగా స్పష్టం చేస్తున్నారు. తానే కస్టమ్స్ అధికారుల వద్దకు స్వచ్ఛందంగా వెళ్లి డిక్లైర్ చేశానని.. వాటి వాస్తవిక విలువను లెక్కించేందుకు వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.
టీ 20 వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శన అనంతరం టీమిండియా క్రికెటర్లు తిరిగి వచ్చేయగా.. హార్దిక్ పాండ్యా మాత్రం సోమవారం ముంబయికి చేరుకున్నారు. తనతో పాటు తీసుకొచ్చిన వాచీల విలువ రూ.5కోట్లుగా చెబుతుంటే.. ఆయన మాత్రం ఖండిస్తున్నారు. తాను తీసుకొచ్చిన వాచ్ ల విలువ రూ.1.5కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. అయితే.. తాను తీసుకొచ్చిన రెండు వాచ్ లను కస్టమ్స్ అధికారులకు చూపించినట్లు చెప్పారు.
అయితే.. వాటికి సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవటంతో.. వాటికి ఎంత పన్ను వేయాలన్న దానిపై హార్దిక్ పాండ్యాకు తర్వాత తెలుపుతామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆ విలువైన వాచ్ లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. హార్దిక్ తీసుకొచ్చిన వాచ్ ల విలువ రూ.5కోట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో స్పందించిన అతను వాటి వాస్తవిక విలువ రూ.1.5కోట్లు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. మరి.. ముంబయి కస్టమ్స్ అధికారులు ఎంత మొత్తంలో సుంకం వేస్తారో చూడాలి.