తారలకు పేర్లు.. వాటికి ముందు బిరుదులు మామూలే. అవి అందరికి ఉంటాయి. కానీ.. బిరుదు పేరుగా మారటం చాలా అరుదు. ఆ మాటకు వస్తే అసాధ్యం. కానీ.. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సత్తా సుపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యం. కావాలంటే.. మేం చెప్పేది నిజమా? కాదా? అన్నది ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన హీరో మొదలు కొని.. మీకు గుర్తున్న హీరోలు.. వారి పేర్లు.. వారికి ఉన్న బిరుదుల్ని గుర్తుకు తెచ్చుండి. ఆ వెంటనే.. వారి పేరును పలికే ప్రయత్నం చేసినప్పుడు.. బిరుదుతో పాటు పేరు వచ్చే ఏకైక హీరోగా సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే నిలుస్తారు.
బిరుదు కాస్తా పేరుగా మారటం.. అది కుదురుకునే తీరు.. దాన్ని విడదీసి పలికటం కష్టంగా మాత్రమే కాదు.. ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మరే హీరోకు సాధ్యం కాదు. ఒక్క సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యం. కృష్ణ పేరు ముందు సూపర్ స్టార్ బిరుడు వచ్చి చేరిన నాటి నుంచి ఆయన్ను ఆపేరుతోనే పిలవటం మొదలైంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అభిమానులు మాత్రమే కాదు మిగిలిన వారు సైతం ఆయన్ను సూపర్ స్టార్ కృష్ణగా మాత్రమే సంబోధిస్తారు.
తెలుగు నేల మీద కృష్ణ పేరు సర్వసాధారణం. దీంతో.. అందరి కృష్ణలకు సూపర్ స్టార్ కృష్ణకు మధ్య వ్యత్యాసం తెలియాలన్న ఉద్దేశంతో అందరూ ఆయన్ను కృష్ణగా కంటే కూడా సూపర్ స్టార్ కృష్ణగా పిలవటం కనిపిస్తుంది. ఇలా బిరుదుతో నటుడి పేరు ప్రస్తావించిన ప్రతిసారీ అన్నది ఒక్క బుర్రిపాలెం బుల్లోడికి మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. తెలుగు సినిమాలోనే కాదు.. దేశీయంగా ఉన్న అన్ని భాషల్లోనూ బోలెడంత మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ.. ఇలా బిరుదునే పేరుగా మార్చుకున్నది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఈ ప్రత్యేకత మరెవరికీ లేదు. ఉండదేమో?