రాజధాని రైతులకు చేయాల్సింది ఎంతో ఉంది కానీ చేయడం లేదు. రాజధాని రైతు విషయమై స్పందించాల్సింది ఎంతో ఉంది కానీ స్పందించడం లేదు. ఏం చేయకుండా ఏం చెప్పకుండా కాలయాపన చేయడంలో అర్థం కన్నా అనర్థమే ఎక్కువ. ఆ విధంగా సీఆర్డీఏ కొత్త సమస్యలు సృష్టిస్తోంది. వీలున్నంత మేరకు రాజధాని అభివృద్ధి పై దృష్టి సారించాల్సి ఉన్నా ఆ విధంగా కాకుండా భూముల అమ్మకం, ప్రభుత్వాల ఆదేశాలు, తరువాత పరిణామాలు వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది.
అంటే భూములు అమ్మితే డబ్బులు వస్తే అప్పుడు రాజధానికి రోడ్లు కానీ ఇతర వసతులు కానీ వస్తాయా అన్నది సీఆర్డీఏను ఉద్దేశించి వినవస్తున్న ప్రశ్న. అంతేకానీ ప్రభుత్వం తరఫున కేటాయింపులు అన్నవి ఇకపై కూడా ఉండవా ? ఇప్పటిదాకా రాజధాని వ్యవహారాలకు సంబంధించి సీఆర్డీఏ సాధించింది ఏమీ లేదు. కోర్టు చెబితే కానీ ప్రభుత్వం తరఫున రాజధాని రైతుకు కౌలు అందడం లేదు. ఈ దశలో సీఆర్డీఏ ఉండి ఏం సాధించిందని !
జగన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక, సీఆర్డీఏను రద్దుచేసింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో సీఆర్డీఏను మళ్లీ తెరపైకి తెచ్చింది. జగన్ సర్కారు నిధుల సేకరణ నిమిత్తం సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూములను వేర్వేరు ప్లాట్లుగా విభజించి వాటిని ఉద్యోగులకు, ఇతర వర్గాలకు అమ్ముకోవాలని చూస్తోంది. అందుకు సీఆర్డీఏను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇది కూడా వివాదానికే తావిచ్చింది.
రాజధాని అభివృద్ధికి సంబంధించిన పనులు వదిలేసి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఏంటన్నది కోర్టు ప్రశ్న. ఏది ఎలా ఉన్నా కూడా సీఆర్డీఏను తమకు అనుగుణంగా వాడుకోవడం వదిలేయడం, లేదా దాని ప్రతిపత్తిని నిర్ణయించడం, వదిలేయడం అన్నవి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. అయితే రాజధాని భూములకు సంబంధించి ఇప్పటిదాకా జగన్ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది కాస్త వివాదాలకు తావిస్తూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ దగ్గర నుంచి భూములు తీసుకుందని పదే పదే సంబంధిత రైతులు అంటున్నారు. అయినా కూడా వీటిని వినిపించుకునే స్థితిలో లేదు జగన్ సర్కారు. ఇప్పటికే బోలెడంత ప్రజాధనం వృథా అయిందని చెబుతున్న జగన్ సర్కారు మాత్రం తాజాగా కోర్టు భవన సముదాయాన్ని మాత్రం నిర్మించి కాస్తో కూస్తో సంబంధిత వర్గాలకు ఊరట ఇచ్చారు. కర్నూలులో కోర్టు అంటూ హడావుడి చేసిన జగన్ కు తరువాత కాలంలో తత్వం బోధపడిందని విపక్షం అంటోంది.
అక్కడ ఓ బెంచ్ ఏర్పాటు సాధ్యమే తప్ప మరొకటికాదని తేలిపోయింది. ఎలా చూసుకున్నా న్యాయ రాజధాని అని పరిపాలన రాజధాని అని శాసన రాజధాని అని ఇన్నింటినీ తెరపైకి తెచ్చి కన్ ఫ్యూజ్ చేయడం మినహా ఇప్పటిదాకా జగన్ అండ్ కో సాధించింది ఏమీ లేదని తేలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో భూముల అమ్మకం చేపట్టినా సీఆర్డీఏ తరఫున రైతుకు జరిగిన మేలు సున్నా అని తేలిపోయింది.