పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయన్న కారణంతో టపాసులు పేల్చడం బంద్ చేయాలని ప్రతి ఏడాది దీపావళికి ముందు చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చవద్దంటూ కొందరు వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలు నిర్దేశించిన 2 గంటల సమయంపాటు టపాసులు కాల్చాలని ఆదేశాలు జారీ చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు టపాసుల అమ్మకాలపై నిషేధం విధించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో టపాసులు అమ్మకాలపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై తెలంగాణ హైకోర్టు నిషేధం విధించింది. బాణసంచా షాపులు మూసేయాలని, క్రాకర్స్ అమ్మడం , కొనడం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను ఈ నెల 19న సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చడం వల్ల శ్వాస కోస వ్యాధులు ప్రబలే ప్రమాదముందని హైకోర్టులో లాయర్ ఇంద్రప్రకాశ్ ఈ పిల్ వేశారు. టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందుల బారినపడే ప్రమాదముందని పిల్ లో పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో టపాసులపై నిషేధం విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో టపాసుల అమ్మకం, కొనుగోలుపై నిషేధం విధించింది. టపాకాయలు కాల్చకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాణసంచా కాల్చకుండా ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు ఆదేశించిందని, కోల్ కతాలో క్రాకర్స్ పై నిషేధం విధించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇదే కోవలో తెలంగాణలో కూడా నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ బీజేపీ స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల టపాసుల నిషేధంపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హిందూ పండుగలకు మాత్రమే పర్యావరణం, కరోనా నిబంధనలు వర్తిస్తాయని పలువురు బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో టపాసుల నిషేధంపై బీజేపీ స్పందన ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.