నాగార్జున, నాగ చైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, సురేఖపై నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు వేయగా…దాని విచారణ కూడా మొదలైంది. ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో తాజాగా దానిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే నాగార్జునపై నారాయణ సెటైర్లు వేశారు. పరువున్నోళ్లు పరువు నష్టం దావా వేస్తారని, పరువులేని నాగార్జున పరువు నష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందని నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు.
“పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్న నాగార్జున ఇప్పుడు కొండా సురేఖపై పరువునష్టం దావా వేశాడు. సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ… బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అన్ పాప్యులర్ అయిన నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు.
కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన తర్వాత ఇక దానిపై ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాగార్జున వంటి వ్యక్తి పరువునష్టం దావా వేయడం చూస్తుంటే ఓ జోక్ లా అనిపిస్తోంది” అని నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలాకాలంగా బిగ్ బాస్ షోపై, నాగార్జునపై నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే.