కరోనా వైరస్ తనకి ఉన్న స్పైక్ ప్రోటీన్స్ ద్వారా మనిషికి అంటుకుంటుంది అన్న విషయం మనందరికి తెలుసు. ఈ స్పైక్ ప్రోటీన్ లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులనే ఉత్పరివర్తనాలు (mutations) అంటాం. కరోనా వైరస్ లో ఉత్పరివర్తనాలు ఉహించినవే. అలాగే అవి ఆ వైరస్ పరిణామక్రమంలో ఒక భాగం కూడా. అలా జరిగిన ఉత్పరివర్తనాలలో ముఖ్యమైనది ఈ N501Y ఉత్పరివర్తనం.
ఇప్పటికే అనేక వేల ఉత్పరివర్తనలుతలెత్తాయి. అవన్నీ కూడా అంతగా ప్రభావం చూపేవి కాలేకపోయాయి. కానీ ఈ N501Y ఉత్పరివర్తనం మాత్రం కొంచెం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.
ఈ కొత్త రకం వైరస్ ఉత్పరివర్తనాన్ని ఎలా కనుగొన్నారు?
COVID మీద ఏప్రిల్ 2020 నుంచి “COVID-19 Genomics UK Consortium” వారు పరిశోధనలు చేస్తున్నారు.ఈ కన్సార్టియం వారు కోవిడ్ బారిన పడిన దాదాపు 1,40,000 మంది నుంచి సేకరించిన నమూనాలను పరిశోధించిన పిదప ఈ ఉత్పరివర్తనాన్ని కనుగొన్నారు.
ఏ విధంగా ఇది మనల్ని భయపెడుతోంది?
ఈ ఉత్పరివర్తనం వలన వైరస్ మరింత ఎక్కువగా అంటుకునే సామర్ధ్యం పొందటంతో పాటు సులభంగా వ్యాపిస్తుంది.పరిశోధకులు చెపుతున్న దాని ప్రకారం ఈ కొత్త రకం వైరస్ కి దాదాపు 70శాతం వేగంగా విస్తరించే స్వభావం ఉంది.అయితే దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ కొత్త రకం వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుందా ?
వైరస్ లో కొత్తగా వచ్చిన ఉత్పరివర్తనంతో వేగంగా విస్తరించే సామర్ధ్యం వచ్చినా కూడా, ఇది అంత తీవ్రమయిన అనారోగ్యం కలుగచేస్తుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. సాధారణ కరోనా వైరస్ లక్షణాలే ఈ వైరస్ కూడా కలుగచేస్తుంది.
ప్రస్తుతం ఉన్న టీకాలు ఈ కొత్త వైరస్ కి పనిచేస్తాయా?
ఇది మనకు కొంచెం ఊరటనిచ్చే అంశం. ఇప్పుడు ఉన్న వాక్సిన్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న వాక్సిన్ కి వైరస్ లో ఉన్న స్పైక్ ప్రోటీన్స్ లోని అనేక ప్రాంతాలకు వ్యతిరేకంగా యాంటీబోడీస్ ని ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. కాబట్టి వైరస్ లో వచ్చిన ఈ అతి చిన్న మార్పు వాక్సిన్ పనితనాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడం అసంభవం. ఒకవేళ భవిష్యత్తు లో వైరస్ అనేక రూపాంతరాలు చెందితే ఇప్పుడున్న వాక్సిన్ ని చిన్న చిన్న మార్పులు చేసి వాడుకోవచ్చు.
- Source: British Medical Journal
- సేకరణ – Dr.A.V.S Reddy