కరోనా అన్నది పెద్ద విషయమే కాదని.. మన దగ్గర కాచే ఎండక మలమల మాడిపోతుందని.. దాని ప్రభావం అస్సలు ఉండదన్నట్లుగా అప్పుడెప్పుడో చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్ది రోజులుగా దాని బారిన పడిన సంగతి తెలిసిందే.
పాజిటివ్ అయినట్లుగా అధికారిక ప్రకటన వెలువడిన నాటి నుంచి ఫాంహౌస్ లో ఉన్న ఆయన.. బుధవారం రాత్రి సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి రాక ముందు.. కేసీఆర్ ఆరోగ్యంపై కథలు.. కథలుగా ప్రచారం జరిగింది.
ఫాంహౌస్ నుంచి యశోదకు తక్కువలో తక్కువ గంట వరకు జర్నీ ఉన్న వేళ.. కారులో అంత దూరం నుంచి వస్తున్నారంటే.. ఆయన కోలుకున్నారన్నమాట వినిపించింది.
అందుకు తగ్గట్లే.. ఎప్పటిలానే ఇస్త్రీ నలగని చొక్కా.. ప్యాంటుతో కారులో నుంచి బయటకు దిగిన ముఖ్యమంత్రి.. మూతికి మాత్రం మాస్కు పెట్టుకోవటం కనిపించింది. చేతికి.. ఎలాంటి గ్లౌజులు వేసుకోలేదు. దాదాపు నలభై నిమిషాలు ఆసుపత్రిలో ఉన్న ఆయన తిరిగి వెళ్లిపోయారు.
ఇంతకూ ఆయనకు పలు టెస్టులతో పాటు.. సిటీ స్కాన్ చెస్టు తీయించుకున్న కేసీఆర్ కు ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లుగా చెప్పారు. ఆయనకు వ్యక్తిగతంగా పరీక్షలు జరిపిన ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఎంవీ రావు.. తర్వాత కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడిందని.. ఆయనలో వైరస్ లోడ్ తగ్గినట్లుగా పేర్కొన్నారు.
కేసీఆర్ కు చేసిన సిటీ స్కాన్ లో.. వైరల్ లోడ్ పెద్దగా లేదని.. ఆయన కోలుకున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. కేసీఆర్ లో కోవిడ్ లక్షణాలు పోయాయని.. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయని.. సిటీ స్కాన్ లోనూ అంతా సాధారణంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని మొక్కులు మొక్కిన వారు.. పూజలు చేసిన వారు.. వేదన చెందిన వారంతా తాజా ఆప్డేట్ తో టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతారని చెప్పక తప్పదు.