వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్‌కు కౌంట్ డౌన్ మొదలైందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదు అవ్వగా.. కాకాణి ఏమాత్రం జంకలేదు. దాదాపు నలభై రోజుల పాటు దర్జాగా తిరిగేసారు. సరిగ్గా అరెస్ట్ చేస్తారని సమయానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
రెండుసార్లు విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు ఇచ్చిన కాకాణి అజ్ఞాతాన్ని మాత్రం విడలేదు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రెండు నెలల నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దిగువ కోర్టులో బెయిల్ నిరాకరించడంతో.. కాకాణి గోవర్ధన్ రెడ్డి సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. కచ్చితంగా అక్కడ తనకు అనుకూల ఫలితం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ కాకాణికి సుప్రీం కోర్ట్ లో సైతం చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
కాకాణి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ దెబ్బతో క్వార్ట్జ్ కేసులో కాకాణికి ఆల్మోస్ట్ దారులన్ని మూసుకుపోయాయి. ఆయన అరెస్ట్ కావడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు. ప్రస్తుతం కాకాణి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బెంగుళూరు, హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో ఆయన కోసం పది బృందాలు గాలిస్తున్నాయి. లుకౌట్ నోటీసులు జారీ చేసినందున ఆయన విదేశాలకు పారిపోయే ఛాన్స్ లేదు. ఇండియాలోనే ఎక్కడో దాక్కుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఒక్కసారి చిక్కారంటే కాకాణి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లక తప్పదని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.