ఏపీలో అవినీతిని సిస్టమ్ లో భాగం చేశారని తెలుగుదేశం ఆరోపిస్తుంటే అందరూ అనుమానంగా చూశారు. కానీ నేడు స్వయంగా వైకాపా ఎమ్మెల్యేనే ఆ విషయాన్ని చెప్పాడు. సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా ఫీలయ్యే వలంటీర్ల వ్యవస్థ అవినీతి గురించి ఆ పార్టీ ఎమ్మెల్యేయే దారుణమైన కామెంట్లు చేశారు.
వలంటీర్లలో అవినీతి పెచ్చుమీరిందని ధర్మవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఎమ్మెల్యేయే అవినీతి గురించి బయట మీడియాతో విమర్శలు చేయాల్సి వచ్చిందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది.
ధర్మవరం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన 267 మంది వలంటీర్లను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి మెమోలు ఇచ్చినట్టు తెలిపారు. వలంటీర్లు ప్రతి పథకం అమలులో డబ్బు వసూలు చేస్తున్నారని అన్నారు.
అయితే, ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారుతుందని ‘‘అవినీతికి పాల్పడిన వలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని‘‘ ఆయన అన్నారు. అయినా నాయకుల అండ లేకుండా అవినీతి చేయగలిగిన సత్తా వాలంటీర్లకు ఉంటుందంటే ఎవరూ నమ్మరు.