అయినవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ పెట్టడం సీఎం జగన్ కు అలవాటేనని మరోసారి రుజువైంది. తన పాదయాత్ర శ్రీకాళహస్తి పట్టణం మీదుగా సాగుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకుంటానన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జగన్ సర్కార్ అనుమతి నిరాకరించింది. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుందని, కనీసం ఆ వైపునకు కూడా వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు చెప్పారు.
కట్ చేస్తే, ప్రముఖ గాయని మంగ్లీకి మాత్రం 20 ఏళ్ళ ఆనవాయితీని పక్కన పెట్టి మరీ ఆలయంలో ఓ ప్రైవేటు పాట కోసం షూటింగ్ కు అనుమతించిన వైనం సర్వత్రా విమర్శలపాలైంది. గత రెండు దశాబ్దాలుగా ఆలయం లోపల వీడియో చిత్రీకరణ పై నిషేధం ఉండగా..మంగ్లీకి మాత్రం అనుమతి ఎలా ఇచ్చారని స్థానికులు, భక్తులు, హిందూ సంఘాలు…జగన్ సర్కార్ పై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగ్లీ శివరాత్రి నాడు విడుదల చేసిన భం భం భోలే పాట వివాదంలో చిక్కుకుంది.
గత 20 ఏళ్లుగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు. కానీ, 10 రోజుల క్రితం ఆలయంలో ఓ పాటను మంగ్లీ బృందం చిత్రీకరించింది. కాలభైరవ స్వామి వద్ద, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మంగ్లీ బృందం నృత్యం చేసి షూట్ చేశారు. రాయల మండపం, రాహు కేతు మండపం, ఊంజల్ సేవ మండపాలలోకూడా మంగ్లీ ఆటపాట సాగింది. దీంతో, రెండు దశాబ్దాల ఆనవాయితీని పక్కనబెట్టి మంగ్లీకి అనుమతి ఎలా ఇచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి.
అయితే, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా మంగ్లీని నియమించిన జగన్…ఈ పాటకు కూడా అనుమతులు ఇప్పించి ఉంటారని విమర్శలు వస్తున్నాయి. జగన్ కు హిందువుల మనోభావాలతో పనిలేదన్న విషయం మరోసారి నిరూపితమైందని హిందూ సంఘాలు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ హిందూ ద్వేషి అనేందుకు మంగ్లీ పాటే సాక్ష్యం అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.