ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన దెందులూరు నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌పై కుట్ర జరుగుతోందని.. ఆయన వర్గం చెబుతోంది. మరోసారి చింతమనేనిని జైలుకు పంపించేలా అధికార పార్టీ నాయకులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీపట్టున్న పెదవేగి మండలంలో .. జరిగిన ఒక ఘటనను ఆధారం చేసుకుని చింతమనేనిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు.
ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు పెదవేగి మండలంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. ఇక్కడే తెరవెనుక ఏం జరిగిందో ఏమో.. చింతమనేని వర్గాన్ని పోలీసులు అరెస్టు చేశారు. దీనిని చింతమనేని ఖండించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. వాస్తవాలు తెలుసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అరెస్టు చేసిన వారిని విడిపించుకుని వెళ్లారు. అయితే.. ఇది పోలీసు వ్యవస్థను ధిక్కరిండమేనని ఆయనపైనా కేసు పెట్టారు.
నిజానికి చింతమనేని వాదనలో తప్పులేదు. అయినప్పటికీ.. ఆయనపై కేసులు పెట్టారంటే.. దీనివెనుక కుట్ర ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చింతమనేని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితం వచ్చేలోపు ఆయనను పట్టుకునేందుకుపోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. పెదవేగిలో వైసీపీ నేతలు.. టీడీపీ నేతలను రెచ్చగొట్టడం.. వారిని బయటకు రాకుండా చేస్తున్నారని చింతమనేని వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు.
దీంతో పెదవేగి కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు మరింత రాజుకున్నాయి. వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇప్పుడు చింతమనేనిని టార్గెట్ చేయడం ద్వారా.. ఆయనను మానసికంగా దెబ్బకోట్టాలన్న కుట్ర దాగి ఉందనేది టీడీపీ నేతల వాదనగా ఉంది. నిజానికి ఆది నుంచి కూడా పెదవేగిపై చింతమనేని చాలానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా నే ఇక్కడ ఓటింగ్ జరిగింది. అయినా కూడా.. ఇక్కడ అలజడి సృష్టించి.. ఆయన గెలపును కూడా తక్కువ చేసి చూపడమో.. లేక ఎమ్మెల్యేగా విజయానికి ముందే.. ఆయనను అరెస్టు చేయించాలనే కుట్రతోనే ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు మలుపుతిరుగుతున్నాయని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.