తెలంగాణా కాంగ్రెస్ రాజకీయం విచిత్రంగా ఉంది. ఏకకాలంలో రెండు రకాల అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అనుకుంటే ఈ రెండు అంశాలు పరస్పర విరుద్ధమైనవి. లేకపోతే ఒకదాని మీద మరొకటి ఆధారపడున్నవే. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చితీరాలన్నది మొదటి అంశం. ఇక రెండో అంశం షర్మిల నాయకత్వంలోని వైఎస్సార్టీపీని విలీనం చేసుకోవాలా ? పొత్తు పెట్టుకోవాలా ? అన్నది.
రెండో అంశంమీద కాంగ్రెస్ నేతల్లో స్పష్టమైన చీలికవచ్చేసింది. అంటే షర్మిలకు అనుకూలంగా కొందరు సీనియర్లు వాదనలు వినిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆయన మద్దతుదారులు షర్మిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పద్దతి ఏదైనా సరే షర్మిలతో చేతులు కలపటం వల్ల కాంగ్రెస్ కు లాభమే కానీ నష్టమేమీ ఉండదని భువనగిరి ఎంపీ, సినియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపదేపదే చెబుతున్నారు. ఈయనకు మరికొందరు సినయర్ నేతలు మద్దతుగా మాట్లాడుతున్నారు.
ఇదే సమయంలో షర్మిల పార్టీ అంటే ఆంధ్రా పార్టీగానే జనాలు తెలంగాణలో గుర్తిస్తారని రేవంత్+మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణా జనాలు వ్యతిరేకమవుతారన్నది రేవంత్ వాదన. 2018లో కాంగ్రెస్-చంద్రబాబు నాయుడు పొత్తు ఫలితాన్ని రేవంత్ పదేపదే ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఇపుడు కాంగ్రెస్ పార్టీ అంటే జనాల్లో మంచి క్రేజు పెరుగుతోందని ఈ పరిస్థితుల్లో షర్మిలతో చేతులు కలపాల్సిన అవసరం ఉందా అని ఎదురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
షర్మిలతో చేతులు కలపాలంటే ఆమెను ఏపీకి పంపించేసి అక్కడ పార్టీకి అధ్యక్షురాలిని చేయాలని కూడా సూచిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు షర్మిల పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. తన ఊపిరి, నడక అంతా తెలంగాణాతోనే ముడిపడుందని పదేపదే చెబుతున్నారు. అయితే పరిస్దితులు ఎప్పుడు ఎలాగ మారుతాయో ఎవరు చెప్పలేరు కదా. అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నపుడే పార్టీల మనుగడ ముందుకెళుతుంది. కాకపోతే తీసుకునే నిర్ణయమేదో తెలివిగా తీసుకోవాలంతే.
ఇక్కడ షర్మిల సమస్య ఏమిటంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కోమాలో ఉంది. కోమాలో పేషంట్ ను లేపటం ఎంత కష్టమో ఇపుడు కాంగ్రెస్ పరిస్ధితి కూడా అంతే. అందుకనే ఏపీకి వెళ్ళటాన్ని షర్మిల వ్యతిరేకిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.