ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని మధురై లో పోలీసు కేసు నమోదు అయ్యింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మధురై కి చెందిన ఓ లాయర్ కేసు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రాయశ్చిత దీక్ష ముగించుకున్న అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. గురువారం నిర్వహించిన వారాహి బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని అవహేళన చేసిన వారిని ఏకిపారేశారు. సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను ఏ స్థాయిలో అయినా పోరాటం చేస్తానని, అవసరమైతే పదవిని ప్రాణాలను త్యాగం చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్ కు చురకలు వేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ టైం లో బీజేపీని టార్గెట్ చేస్తూ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు.
సనాతన ధర్మం అనేది కరోనా కంటే ప్రమాదకరమని.. అదొక వైరస్ అని ఆ మహమ్మారిని నిర్మూలించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో స్టాలిన్ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నేతలు సైతం ఉదయనిధి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ సైతం ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపట్టారు. పేరు ప్రస్తావించకుండా.. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని.. దాన్ని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారని పవన్ ఘాటుగా తమిళంలోనే కౌంటర్ ఇచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. తమిళనాడులో ఈ అంశం వివాదంగా మారింది. స్టాలిన్ పార్టీ నేతలు ఏపీ ఉపముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్నారు. ఈ అంశంపై ఉదయనిధి స్పందిస్తూ.. `వెయిట్ అండ్ సీ` అని బదులిచ్చాడు. ఇంతలోనే వంజినాథన్ అనే లాయర్ పవన్ కల్యాణ్‌పై మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇరు రాష్ట్రాల డిప్యూటీ సీఎంల మధ్య మొదలైన వార్ ఆసక్తికరంగా మారింది.