ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తాజాగా తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో మీమ్స్ అదిరిపోతు న్నాయి. ఓ వారం కిందట ఆయన ప్రకటించిన కీలక అంశంపై ఇప్పుడు ఏకంగా చర్యలు తీసుకునే స్థాయికి వచ్చేశారు. దీంతో నెటిజన్లు.. ఇదంతా ఎన్నికల వాయువేగంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సహజంగా పార్టీలకు అతీతంగా ఏ నాయకుడిని తీసుకున్నా.. ఇచ్చిన హామీని పట్టాలెక్కించేందుకు నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఒక్కొక్కసారి.. అసలు సదరు హామీని మరిచిపోయినా.. పోవచ్చు.
అది కూడా కీలకమైన అంశం అయితే.. ఇలా చెప్పి.. అలా మరిచిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. భవిష్యత్తులోనూ ఉంటాయి. అయితే.. ప్రధాని మోడీ.. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిప్పుడు మాదిగ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ..(ఎంఆర్ పీఎస్ సభలో) ఎస్సీ వర్గీకరణకు తాము మద్దతిస్తున్న ట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఎంఆర్ పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను హృదయానికి హత్తుకుని ఓదార్చారు. ఎస్సీవర్గీకరణకు త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
అయితే.. సహజంగానే ఇదిఒక తేనెతుట్టె. ఎస్సీ వర్గీకరణ అంత ఈజీ ఏమీ కాదు. దీంతో మోడీ చేసింది ఎన్నికల ఆర్భాటమేననే విమర్శలు వచ్చాయి. కానీ, తాజాగా మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్టు పీఎంవో అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలంటూ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించాయి. అయితే.. ఇది కూడా ఫక్తు ఎన్నికల వ్యూహమేనన్నది విశ్లేషకుల మాట. ఈ వాయువేగం.. ఏపీ రాజధాని అమరావతిలో లేదు. సింగరేణిలో లేదు. విభజన హామీలపైనా లేదు.. అని గతాన్ని తవ్వేస్తున్నారు.
ఏంటీ రిజర్వేషన్
ఎస్సీ సామాజిక వర్గాల్లోని ఉప కులాలకు కూడా సమాన స్థాయిలో లేదా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఫలితాలు అందేలా చేయడం కోసం ఎస్సీ వర్గీకరణ జరపాలని ఎం.ఆర్.పి.ఎస్. గత మూడు దశాబ్దాలుగా పోరాటాలు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో పెద్ద న్యాయపోరాటమే జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి. కొన్నిసమర్థించాయి. ముఖ్యంగా మాల సామాజిక వర్గంరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్గీకరణను వ్యతిరేకిస్తోంది.