టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన అలీ వైసీపీ నేతగానూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి హీరో పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలీ…2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరతారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయాలు వేరు… సినిమాలు… స్నేహం వేరు అని అలీ చెప్పారు. కానీ, ఇప్పటికీ పవన్ తనకు మంచి స్నేహితుడు అని చెబుతూ ఉంటారు అలీ.
అయితే, 2019 ఎన్నికల సమయంలో గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించిన అలీ…ఆ తర్వాత భంగపాటుకు గురికావాల్సి వచ్చింది. ఆ తర్వాత తనకు జగన్ న్యాయం చేస్తారని గంపెడు ఆశలతో ఉన్న అలీ అలాగే పార్టీలో కొనసాగుతున్నారు. ఇక, ఇటీవల అలీని జగన్ రాజ్యసభకు పంపుతారని కూడా ప్రచారం జరిగినా అవన్నీ ఒట్టి మాటలు అని తేలిపోయాయి. పోనీ, త్వరలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో అలీకి ఏదో ఒక నామినేట్ పోస్ట్ అయినా దక్కుతుందని అంతా అనుకున్నారు.
కానీ, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా సరే అలీకి మాత్రం జగన్ రిక్తహస్తాలే చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ వైసీపీని వీడుతున్నారని తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పుకార్లపై అలీ స్పందించారు. తాను, వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని అలీ తేల్చి చెప్పారు. తాను వైసీపీలో చేరింది పదవుల కోసం కాదని…జగన్ సీఎం గెలుపే లక్ష్యంగా పార్టీలో చేరానని అలీ చెప్పుకొచ్చారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే ముఖ్యమని అన్నారు.