పార్టీల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఒక్కోసారి పార్టీల పరువును తీసేస్తుంటాయి. అయినా సరే నేతల మధ్య పోరు ఎప్పటికీ ఆగదు. ఇక అధినేతలు కూడా ఇవన్నీ మామూలే అని చూసీ చూడనట్లుగా వదిలేస్తుంటారు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కదా ఇలాంటివన్నీ మామూలే అన్నట్లుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ పరువు గోడల మీదకెక్కింది. పరువు ఎక్కడైనా రోడ్డున పడుతుంది కానీ గోడలమీదకు ఎలాగ ఎక్కుతుందని అనుకుంటున్నారా ?
దక్షిణ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద పోస్టర్లు వెలసాయి. పోస్టర్లను నియోజకవర్గంలోని గోడలపై ఎవరో అంటించారు. అందులో రాజకీయ నిలకడలేని నేత..నీకో నమస్కారం. నువ్వు ఏ పార్టీలో నుండి పోటీచేస్తావు ? ఏ పార్టీలోకి వెళతావు ? అని పెద్దక్షరాలతో క్యాప్షన్ రాసుంది. ఆ పోస్టర్లోనే వాసుపల్లి ఫొటో ప్రింట్ చేశారు. పోస్టర్ పైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల గుర్తులను ముద్రించారు.
గణేష్ కు వ్యతిరేకంగా పార్టీలోనే ఉన్న ప్రత్యర్ధులు ఎవరో పెద్ద పోస్టర్లను ముద్రించి నియోజకవర్గమంతా అంటిచారు. ఇపుడీ విషయమే పార్టీలో, పబ్లిక్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ఒకవైపు రాబోయే ఎన్నికల్లో తానే పోటీచేస్తాననే ధీమాతో వాసుపల్లి ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తమకే టికెట్లు రావాలని సీతంరాజు సుధాకర, ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అంటే పార్టీలోని వాళ్ళే ఎవరైనా గణేష్ పరువు తీసేయాలన్న ఉద్దేశ్యంతో పోస్టర్లను అంటించారా అనే చర్చ పెరిగిపోతోంది.
ఇదే సమయంలో టీడీపీ తరపున గెలిచి వైసీపీలోకి వెళిపోయారు కాబట్టి ఆ మంటలో తమ్ముళ్ళలో ఎవరైనా కూడా గణేష్ పరువును గోడలపైకి ఎక్కించుండచ్చు. మొత్తంమీద ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోరకమైన గొడవలతో పార్టీ పరువు పలుచనైపోతోంది. మొన్నటివరకు రామచంద్రాపురం నియోజకవర్గంలో గొడవలయ్యాయి. తర్వాత గన్నవరంలో మొదలయ్యాయి. ఇపుడు విశాఖ దక్షిణంలో మొదలైంది. చివరకు నేతల మద్య గొడవలు ఎక్కడి దాకా వెళతాయో చూడాలి.