తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులలో కొత్త జోష్ వచ్చింది. దాంతోపాటు సీఎల్పీ సమావేశం కూడా డిసెంబర్ 3వ తేదీ రాత్రి జరుగుతుందని, సీఎం అభ్యర్థి ఎంపిక కూడా అదే రోజు అయిపోతుందని ప్రకటన రావడంతో కాంగ్రెస్ తన పాత పద్ధతిని మార్చుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజు ఆ ప్రక్రియ వాయిదాపడడంతో డిసెంబర్ 4 ఉదయాన్నే సీఎల్పీ నేత, సీఎంగా కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి లేదా మరొకరు ప్రమాణస్వీకారం చేస్తారని అంతా భావించారు.
కానీ, కాంగ్రెస్ తన తీరు మారలేదని మరోసారి నిరూపించింది. ఈరోజు ఉదయం సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులంతా కలిసి ఏకతాటిపైకి వచ్చి ఒక అభ్యర్థిని ఎంచుకోలేకపోయారు. అంతేకాదు, సీఎల్పీ నేతను, సీఎం అభ్యర్థిని ప్రకటించాలంటూ బంతిని కాంగ్రెస్ సభ్యులంతా కలిసి హై కమాండ్ కోర్టులో పడేశారు. ఇక యథా ప్రకారం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు మల్ల గులాలు పడుతూ ఆ పంచాయతీని ఢిల్లీలో చేద్దాం రమ్మని కాంగ్రెస్ పరిశీలకులను ఢిల్లీకి ఆహ్వానించారు.
ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాకూర్ ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన తర్వాత సిఎల్పీ నేత, సీఎం అభ్యర్థిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని, ఏ నిర్ణయాన్ని తొందరగా తేల్చరని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఇలా నిర్ణయాలలో జాప్యం వల్లే పార్టీతో పాటు ఆ పార్టీని నమ్ముకుని ఓటేసిన వారికి కూడా అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థి అనుకుంటూ ఉంటారని, అధికారంలోకి వచ్చాం కదా రేవంత్ రెడ్డి వంటి వ్యక్తిని సీఎం చేసి త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అన్న ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఉండదని విమర్శిస్తున్నారు. ఇలా, అంతర్గత కుమ్ములాటలతోనే కాంగ్రెస్ పార్టీ సగం బలహీనమైందని విమర్శిస్తున్నారు. మరి, రేపయినా ఆ ప్రకటన ఉంటుందా… లేక వినాయకుడి పెళ్లి రేపు తరహాలో వాయిదా పడుతుందా అన్నది తేలాల్సి ఉందని ట్రోల్ చేస్తున్నారు.