ఏమిటో కర్నాటకలో యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి అందినట్లే అంది మళ్ళీ జారిపోతోంది. యడ్యూరప్ప సీఎం కుర్చీలో కూర్చోవటం ఏదో సమస్య మొదలవ్వటం వెంటనే కుర్చీ నుండి దిగిపోవటం అవుతోంది. తాజాగా అప్పుడెప్పుడో చేసిన ఓ పని ఇపుడు ఆయన మెడకు చుట్టుకోవటంతో రాజీనామా చేయక తప్పని పరిస్దితులు తలెత్తింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఐటి పార్కు కోసం 2013లో ప్రభుత్వం 4 ఎకరాలను కేటాయించింది. అయితే తర్వాత ఆ స్ధలాన్ని ఇళ్ళ నిర్మాణ పథకం కోసం డీ నోటిఫై చేశారు. డీ నోటిఫై చేసింది యడ్యూరప్పే. డీ నోటిఫై చేసిన తర్వాత ఆ స్ధలం ఆధారంగా బారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వెలువెత్తాయి. ఆరోపణలే కాకుండా యడ్యూరప్పపై అప్పట్లో లోకాయుక్తలో కూడా కేసు వేశారు. కుంభకోణంపైనే కాకుండా యడ్డీ పాత్రపైన కూడా దర్యాప్తు జరపాలని లోకాయుక్త తీర్పిచ్చింది.
తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని, విచారణను ఆపుచేయించాలని అప్పట్లోనే యడ్యూరప్ప చేసుకున్న అప్పీలను కర్నాటక హైకోర్టు కొట్టేసింది. తాజాగా అదే కేసుపై హైకోర్టు ఉత్తర్వులిస్తు అప్పటి కుంభకోణం కేసును లోకాయుక్తే నేరుగా విచారణ చేయాలని కూడా హైకోర్టు స్పష్టంచేసింది. మరప్పటి కేసులో యడ్డీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందట. దాంతో ఇపుడు మొదలవ్వబోయే విచారణలో యడ్డీ తగులుకోవటం ఖాయయని బీజేపీ అగ్రనాయకత్వానికి అర్ధమైపోయిందట. అందుకనే వెంటనే యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా తప్పించేందుకు ఢిల్లీ నాయకత్వం డిసైడ్ అయిపోయింది. యడ్డీ తీరుపై ఢిల్లీ నాయకత్వం తీవ్ర అసంతృప్తిగా ఉందంటున్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో యడ్డీ చేసిన సిఫారసునలు పట్టించుకోలేదట. అలాగే మంత్రివర్గ విస్తరణకు అనుమతి కోరుతున్నా ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటువంటి ఘటనలతో యడ్డీపై ఢిల్లీ నాయకత్వం బాగా అసంతృప్తిగా ఉన్నారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు.
ఫిబ్రవరి 27వ తేదీన తన పుట్టినరోజు వరకు కంటిన్యు చేయాలని తర్వాత తానే రాజీనామా చేస్తానని యడ్యూరప్ప ఢిల్లీ నాయకత్వాన్ని కోరారని ప్రచారం జరుగుతోంది. మరి యడ్డీ రిక్వెస్టును ఢిల్లీ నాయకత్వం ఆమోదిస్తుందో లేదో సస్పెన్సుగా మారింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, లింగాయత్ నేత లక్ష్మణ్ సావడిల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. మొదటిసారి సీఎం అయిన యడ్డీ అవినీతి ఆరోపణలపై 2011లో రాజీనామ చేశారు. తర్వాత 2018లో సీఎం అయినా ప్రభుత్వం మైనారిటిలో పడిపోవటంతో రాజీనామా చేశారు. తర్వాత మళ్ళీ 2019లో ముఖ్యమంత్రయినా బలనిరూపణలో విఫలమై రాజీనామా చేశారు. మళ్ళీ ఇపుడు అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సొస్తోంది. అంటే నాలుగుసార్లు ముఖ్యమంత్రయిన యడ్డీ ఎప్పుడు కూడా ఐదేళ్ళ కాలం కొనసాగలేకపోవటం విచిత్రం.