టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఏపీలో గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, ఆ కుట్రలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని, చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారని జగన్ విమర్శించారు.
ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ మాటలను ఆయన సొంత చెల్లెలు, తల్లి కూడా నమ్మడం లేదని చురకలంటించారు. వివేకా హత్య జరిగిన పరిస్థితులు, ఏపీలో రాజకీయ వాతావరణం గురించి వివేకా కుటుంబ సభ్యులు చెబుతున్నారని అన్నారు. సొంత చెల్లి, తల్లి విశ్వసించని జగన్ తన మీద ఎటువంటి ఆరోపణ చేసినా విలువ లేదన్నారు. మిత్రుడు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాను ఒక సూచన చేస్తున్నానని, తన చెల్లెళ్లు, తల్లి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని రేవంత్ సలహా ఇచ్చారు.
వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆవేదన కుటుంబ అంతర్గత విషయం అయినప్పటికీ బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి దాని మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుందని సూచించారు. రేవంత్ రెడ్డి 100% కాంగ్రెస్ పార్టీకి విధేయుడని అన్నారు. చంద్రబాబు గారి పట్ల తనకు గౌరవం ఉందని, కానీ ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని క్లారిటీనిచ్చారు. చంద్రబాబుతో ఉన్న రాజకీయ బంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.
తెలంగాణలో 17 మంది ఎంపీలను గెలిపించుకునే బాధ్యత తనకు ఉందని. ఇక్కడ ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఏపీకి వెళ్లలేదని చెప్పారు. షర్మిల పెద్ద నాయకురాలని, 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఎవరు ఎక్కడ ఎన్నికల ప్రచారం చేయాలి అనే విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.