తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే కవిత రూపంలో ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ‘‘బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ, ఆ పిడికిలి విప్పిచూస్తే.. త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం. ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుంది, విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుంది.. అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇక, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో సోనియా గాంధీ స్వయంగా పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆరోగ్య కారణాల రీత్యా ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలనుద్దేశించి సోనియా గాంధీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించింది.
కాగా, ఎగ్జిట్ పోల్ ఫలితాలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని, తెలంగాణలో 12 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక తెలంగాణకు 4 కేంద్రమంత్రి పదవులు అడుగుతామని తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి 7 నుంచి 12, కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 10 సీట్లు వస్తాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.