తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య సభలో మాటలు తూటాలు పేలాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి అధికార పార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే, గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో నిరసన తెలిపేందుకు హరీష్ రావు ప్రయత్నించగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివరాలకే పరిమితం కాకుండా చర్చకు లేవదీసే అంశాలను ప్రస్తావించవద్దని స్పీకర్ ప్రసాద్ రావు సూచించారు. ఈ రోజు సభలో కేటీఆర్, హరీష్ రావులకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ కు ప్రజాస్పూర్తిపై అవగాహన లేదని, 49 శాతానికి, 51 శాతానికి తేడా ఉంటుందని గెలిచిన సీట్ల గురించి చెప్పుకొచ్చారు. 51 శాతం వచ్చిన వారికి వంద శాతం ప్రజాస్వామ్యంలో 49 శాతానికి సున్నా విలువ ఉంటుందన్నారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్ కు చురకలంటించారు. బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయబోమని, వారు చేసిన తప్పులు సభలో వారి ముందే వినిపిస్తామని, అదే వారికి తగిన శిక్ష అని రేవంత్ అన్నారు. ఏది ఏమైనా సభలో ఈ రోజు రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నరీతిలో మాటల యుద్దం జరిగింది.
నిరసన తెలిపేందుకు అనుమతినివ్వాలని హరీష్ రావు స్పీకర్ ను కోరారు. ఈ నేపథ్యంలోనే సభలో అభ్యంతరాలు, విభేదాలపై రాబోయే రోజుల్లో చర్చించుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఆ తర్వాత ఎలాంటి సవరణలు లేకుండా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆ తర్వాత సభను బుధవారానికి వాయిదా వేసినట్టుగా స్పీకర్ ప్రసాదరావు ప్రకటించారు.