సంచలన సవాలు విసిరారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలపై ఆయన స్పందించారు. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు చెప్పిన ఆయన.. ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్ లలో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేతలు తప్పవని తేల్చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలపైనా స్పందించారు.
‘‘నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా. విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం. హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే ఇప్పటికి పరిమితం. ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్.. చెరువులు.. నాలాల ఆక్రమణల తొలగింపునకే తొలి ప్రాధాన్యం’’ అని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చేసిందన్న రేవంత్.. ‘జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్ లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు’ అని ప్రశ్నించారు. కేటీఆర్ ను డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావుకు మరో బంఫర్ ఆఫర్ ఇచ్చారు.
‘‘ఆయన ఒప్పుకుంటే ఆయన ఆధ్వర్యంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధరణ కమిటీ వేస్తాం’ అని ప్రకటించారు. మరి..దీనికి హరీశ్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి. ఇక.. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయని.. వాటిని ఎదుర్కొంటామే తప్పించి వెనక్కి తగ్గేది లేదన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం అంటూ లేదన్నారు.
ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వదులుతున్నారని.. ఆ నీళ్లు హైదరాబాద్ ప్రజలు తాగాలా.? అని ప్రశ్నించారు.
అందుకే కూల్చివేతలు చేస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలో ఉన్నాయని చెప్పారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తామన్న రేవంత్.. 111 జీవోను గత ప్రభుత్వం ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. కానీ.. 111 జీవోను అలాగే ఉంటుందన్నారు.
రుణమాఫీ అందరికి జరుగుతుందన్న రేవంత్.. కలెక్టర్ల దగ్గర గ్రీవెన్స్ పెట్టామన్నారు. రుణమాఫీ అమలుపై హరీష్, కేటీఆర్ లు విమర్శలు చేస్తున్నారన్నారు. రుణమాఫీ కాని వారి జాబితా కలెక్టరేట్లో ఇవ్వాలని.. వాటిని పరిశీలిస్తామన్నారు. ‘‘ఇప్పటివరకు రూ.17,933 కోట్లు రుణమాఫీకి జమ చేశాం. 2 లక్షలకు పైగా ఉన్నవారు.. పైన ఉన్న అమౌంట్ కట్టేస్తే రూ.2లక్షల రుణమాఫీ జరుగుతుంది’’ అని చెప్పారు.
ఓవైసీ కాలేజీ విషయంలో విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టపోతుందని సమయం ఇచ్చామన్న రేవంత్.. తమకు విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమని.. ఆ విషయాన్ని ఆలోచిస్తున్నట్లు చెప్పటం ద్వారా కూల్చివేతలు ఇప్పట్లో జరగవన్న సంకేతాల్ని ఇచ్చారని చెప్పాలి.