బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ లేఖ తన తండ్రి కేసీఆర్ కు తాను రాసిన అంతర్గత లేఖ అని, అది మీడియాకు ఎలా లీక్ అయిందో తనకు తెలియదని కవిత అన్నారు. కేసీఆర్ దేవుడని, కానీ, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే కవిత కామెంట్లపై ఆయన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు.
అంతర్గతంగా మాట్లాకోవాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటేనే మంచిదని, ఇది అందరికీ వర్తిస్తుందని తన చెల్లెలు కవితకు కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు. ప్రజాస్వామ్య పార్టీ అయిన బీఆర్ఎస్ లో అధ్యక్షుడికి ఎవరైనా.. ఏ రూపంలోనైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని అన్నారు. కేసీఆర్‌కు ఉత్తరాలు ఇచ్చినవారు గతంలో కూడా ఉన్నారని, తమ పార్టీలో ఓపెన్ కల్చర్ ఉంటుందని చెప్పారు. అయితే, పార్టీ ఫోరమ్స్ ఉన్నాయని, అధ్యక్షుడిని నేరుగా కలిసే అవకాశం ఉంటుందని కవితనుద్దేశించి పరోక్షంగా కేటీఆర్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని విమర్శించారు. ఆ దెయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలనేదే తమ టార్గెట్ అని కేటీఆర్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ‘యంగ్ ఇండియన్’ కంపెనీ నిధుల కేసు గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు. ఆ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అప్పటి పీసీసీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పేరుందని అన్నారు. అది సీటుకు రూటు కుంభకోణమని, పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ డబ్బులిచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారని గుర్తు చేశారు. ఈడీ ఛార్జ్‌షీట్ ద్వారా కోమటిరెడ్డి కామెంట్లకు ప్రూఫ్ దొరికిందని చెప్పారు. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా రేవంత్ రెడ్డికి బ్యాగ్ మ్యాన్ అని పేరు పెట్టారని కేటీఆర్ సెటైర్లు వేశారు.