తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రెండ్రోజుల క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ ను అక్కడి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. 6 నుంచి 8 వారాలలో కేసీఆర్ కోలుకుంటారని తెలిపారు. ఈ క్రమంలోనే యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి హరీష్ రావు, కేటీఆర్, వైద్యులను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ను పరామర్శించానని, ఆయన కోలుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించానని రేవంత్ వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని, ఇదే విషయం ఆయనతో చెప్పానని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలనకు కేసీఆర్ సూచనలు కూడా అవసరమన్నారు రేవంత్.
ప్రజల పక్షాన సభలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముందన్నారు. కేసీఆర్ త్వరలోనే కోలుకొని శాసనసభకు రావాలని ఆయనను కోరానని రేవంత్ అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించడం చర్చనీయాంశమైంది. వారిద్దరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.