తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్రమార్కులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్). నిబంధనలను ఎడమ కాలితో తొక్కి ఇష్టానుసారంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను కబ్జా చేసి నిర్మాణాలు చేసిన, చేపడుతున్న వారే హైడ్రా టార్గెట్. హైదరాబాద్, సికింద్రాబాద్లల్లో అక్రమంగా కట్టిన బిల్డింగులు, అపార్ట్మెంట్లను నేలమట్టం చేయడం, చెరువులను పరిరక్షించడం హైడ్రా బృందం పని.
రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా ప్రస్తుతం కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. 42 రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఆగస్టు 24న సినీ నటుడు నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను సైతం నేలమట్టడం చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే హైడ్రా కూల్చివేతలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెరువులను అక్రమిస్తే ఎవరినైనా వదిలేదే లేదని.. ఎంతమంది ఎన్నిరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోమని రేవంత్ రెడ్డి తేల్చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల కోసమో, నాయకులపై కక్ష సాధింపు కోసమో ఇదంతా చేయడం లేదని.. శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలను చేపట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.