తెలంగాణ కాంగ్రెస్ కు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో సారథ్య బాధ్యతలు చేపట్టి.. అధికారంలోకి తెచ్చి.. ముఖ్యమంత్రి పీఠాన్నీ సాధించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీపై మరింత పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా తన మనిషినే నియమింపజేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో దాదాపుగా విజయవంతం అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
తన విశ్వాసపాత్రుడికే పీసీసీ చీఫ్ పదవి దక్కనుందని అంటున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటూ తన పంతం నెగ్గించుకున్న నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే. అంతకుముందు కాసు బ్రహ్మానంద రెడ్డి ఇలా మాట బలమైన నాయకుడిగా ఉండేవారని చెబుతారు. అయితే, ఇప్పటి తరంలో ఆ స్థాయి గల నాయకులు కష్టమే. కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి నియమాకంలో రేవంత్ తన ముద్ర చూపారనే మాట వినిపిస్తోంది.
సుదీర్ఘ తర్జన భర్జనల అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియమాకాన్ని త్వరలో ప్రకటించనుందని, అదికూడా సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేసిన వ్యక్తినే నియమించనుందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో పార్టీలోని సీనియర్ నేతలతోపాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇస్తూనే రేవంత్ ప్రతిపాదనను అధిష్ఠానం ఆమోదించిందని అంటున్నారు.
అధ్యక్ష పదవి కోసం సీనియర్ల అండతో పలువురు నేతలు పోటీ పడినా.. సీఎం రేవంత్ సూచించిన నాయకుడి వైపే అధినాయకత్వం మొగ్గు చూపిందని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల నుంచి ముగ్గురి పేర్లపై ప్రధానంగా చర్చ జరిగిందని.. బీసీ నేతనే ఎంపిక చేశారని తెలుస్తోంది.
మహేశ్ కుమార్ గౌడ్ కే చాన్స్?
సీఎం రేవంత్ అభిప్రాయానికి విలువిచ్చిన కాంగ్రెస్ హై కమాండ్.. టీపీసీసీ చీఫ్ గా కొత్తగా ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇస్తుందని తెలుస్తోంది. ఈయన సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కూడా తీవ్రంగా పోటీ పడినప్పటికీ.. రేవంత్ ఎంపిక ప్రకారం మహేశ్ కుమార్ గౌడ్ కే ఓటు వేసినట్లు సమాచారం. పైగా.. రేవంత్ దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 లక్ష్యంగానూ ఈ ఎంపిక చేపట్టినట్లు తెలుస్తోంది.
విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన మహేశ్ కుమార్ గౌడ్.. ఎన్ఎస్ యూఐ నుంచి ఎదుగుతూ వచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన రెండుసార్లు నిజామాబాద్ అర్భన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడై.. గాంధీభవన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 2023 ఎన్నికల్లో షబ్బీర్ అలీ కోసం నిజామాబాద్ అర్బన్ సీటును త్యాగం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
అంతకుముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటినుంచి పీసీసీ అధ్యక్షుడు, సీఎం అయిన సమయంలోనూ మహేష్ పూర్తి మద్దతు పలికారు. రేవంత్ కు వ్యతిరేకంగా గళం వినిపించినవారిని అడ్డుకున్నారు. దీంతో తన లక్ష్యాలకు తగినట్లుగా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్.. టీపీసీసీ చీఫ్ గా మహేష్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కానీ, ఈ మొత్తం వ్వవహారంలో మహేశ్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమించాలన్న ఉద్దేశం కన్నా.. కాంగ్రెస్ లోని పాతకాపులకు రేవంత్ చెక్ పెట్టారన్నదే ప్రధానంగా కనిపిస్తోంది.
మధుయాష్కి గౌడ్ లాంటివారు పీసీసీ అధ్యక్షుడైతే.. అధిష్ఠానంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో స్వతంత్రంగా వ్యవహరిస్తారనే అనుమానం రేవంత్ కు మొదటినుంచీ ఉందని, అది ముఖ్యమంత్రిగా తన పనులకు అడ్డంకులు సృష్టిస్తుందని ఆయన భావించి ఉంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మధుయాష్కిని అడ్డుకోవడం ద్వారా పార్టీలోని సీనియర్లందరిపైనా పైచేయి సాధించేందుకు రేవంత్ గట్టి ప్రయత్నాలు చేసినటుల పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై పట్టు పెంచుకుంటున్న రేవంత్.. పార్టీపైనా తన పట్టు సడలకుండా చూసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.