ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో పర్యటించారు. జగన్ వస్తున్నారని.. ఈ ప్రాంతంలో ప్రజలను ఇళ్లకే కట్టడి చేశారు. పైగా రెండు గంటల కార్యక్రమానికి దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టారని తెలిసింది. ఇక, సభలో మాట్లాడిన సీఎం జగన్.. స్వోత్కర్షలకు.. పరనిందలకు ప్రాధాన్యం ఇవ్వడం కొసమెరుపు. తొలుత ఆక్వా వర్సిటీకి శంకుస్థాపన చేశారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలోనే ఆక్వా వర్సిటీలు ఉన్నాయని, మూడో వర్సిటీ నరసాపురంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారుల బాగు కోసం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో 9 హార్బర్లు రాబోతున్నాయన్నారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆయిల్ డ్రిల్లింగ్ కార్యక్రమాల వలన నష్టపోయిన 20 వేల మంది మత్స్యకారులకు రూ. 108 కోట్లు పరిహారం ఇస్తున్నామన్నారు. మత్స్యకారులకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మత్స్యకారులు వలసలు పోకుండా వారికి మెరుగైన జీవితం కోసం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. వాటి కోసం రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 14 ఏళ్లు పాలించానని డబ్బా కొట్టుకునే చంద్రబాబు మత్స్యకారులకు ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.
జగనన్న ప్రభుత్వం అంటే మనం ప్రభుత్వం అని అందరూ అనుకునే పరిస్థితి కనిపిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. కొల్లేరులో 5వ కాంటూరు వరకు నీరు నిల్వ ఉండేలా రూ. 108 కోట్లతో రెగ్యులేటర్ నిర్మాణం చేపడుతున్నామని, జిల్లాలో చాలా విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. గోదావరి పక్కనే ఉన్నా తాగునీరు కొరత ఉందని.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. వశిష్ట గోదావరిపై నరసాపురం వద్ద వంతెన నిర్మాణానికి జనవరిలో టెండర్లు పిలుస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. మొత్తంగా జగన్ ప్రసంగం అంతా కూడా తన గొప్పలు.. పరుల తప్పులు ఎత్తిచూపేలా ఉండడం గమనార్హం.