సోమవారం ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓటర్ల నాడిని నిక్షిప్తం చేసిన ఈవీఎంలను ఎన్నికల సంఘం ప్రత్యేక భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలలో భద్ర పరిచింది. ఈ స్ట్రాంగ్ రూమ్స్ పరిధిలో రెండు కిలో మీటర్ల వరకు కూడా.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా.. కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. మరి ఇలాంటి చోట.. ఏకంగా ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది పార్టీ చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీని కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ రూమ్‌గా పరిగిణించి.. ఈ జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడ భద్ర పరిచింది. అయితే.. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది ఈ స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతంలో పార్టీ నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్లు ప్రదర్శించారని.. అధికార వైసీపీ ఎన్నికల ప్రచార పాటలతో డీజే నృత్యాలు చేశారని చంద్రబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ పార్టీలో 450 మందికిపైగా పోలీసు అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ అత్తాడ బాపూజీ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆయన కోరారు. ఈ మేరకు తన ఫిర్యాదును చంద్బరాబు మెయిల్ చేశారు.