సంచలన వ్యాఖ్యలు.. వివాదాస్పద కామెంట్లు.. దూకుడుగా వ్యవహరించటం లాంటివి ఇప్పుడున్న రాజకీయాల్లో బోలెడంత మంది కనిసిస్తారు. అందుకుభిన్నంగా కాస్తంత సంప్రదాయ ధోరణిలో వ్యవహరించే నేతలు తక్కువగా ఉంటారు. అలాంటి నేతగా ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్రాజును చెప్పొచ్చు. తాజాగా ఆయన ఒకప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద కావటం గమనార్హం. రాష్ట్రంలో జగన్ పాలన మీద విమర్శలు చేసిన విష్ణుకుమార్ రాజు.. ముఖ్యమంత్రి సంపాదన నెలకు రూ.2వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. తనకు ఆ విషయాన్ని ఏపీ మంత్రి ఒకరు షేర్ చేసుకున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీ రాజధాని మీదా ఆయన కీలక వ్యాఖ్య చేశారు. అమరావతినే రాజధాని అని తమ పార్టీ వారు చెప్పేశారని.. వచ్చే ఎజెండా అదేనని చెప్పారు.
విశాఖ రాజధాని అవుతుంది కదా? మీకు సంతోషంగా లేదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘మాకెందుకండీ రాజధాని? మొదట్లో ఏదో అనుకున్నాం కానీ మోసం చేస్తారని అనుకోలేదు. మొదట్లో నేను కూడా రాజధాని వస్తే స్వాగతం అన్నట్లు ఒక చోట స్టేట్ మెంట్ ఇచ్చా. కానీ.. అమరావతి రైతులను చంపేసి అంటే.. అది తప్పు కదా? పాలనా పరమైన రాజధాని అంటే ఫఱ్లేదు. వైజాగ్ లో ఈ ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది’’ అని వ్యాఖ్యానించారు.
తాను టీడీపీలో చేరిపోతారన్న ప్రచారం జరుగుతుందన్న మాటలో నిజం లేదన్నఆయన.. 2019లో తనను టీడీపీ.. వైసీపీలు రెండు ఆహ్వానించాయన్నారు.
చంద్రబాబు అంటే తనకు గౌరవమని.. ఆయనంటే తనకు కూడా అభిమానం ఉందన్నారు. అయితే.. రావటం జరిగదని చెప్పినట్లు చెప్పారు. జగన్ కూడా తనను పార్టీలో చేరాలని కోరారని.. కానీ వెళ్లలేదన్నారు. మూడు పార్టీల కలయిక తప్పదని పబ్లిక్ అంటున్నారంటూకీలక వ్యాఖ్య చేశారు.