ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురాకృష్ణరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిగిన విషయం విదితమే. గతంలో జరిగిన విచారణ నేపథ్యంలో రఘురామ పిటిషన్ పై జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ కు రఘురామ తిరిగి రీజాయిండర్ ఇచ్చారు.
జగన్ కు బెయిల్ వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను రీజాయిండర్ ద్వారా రఘురామ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమాస్తుల కేసులో సహనిందితులుగా ఉన్న వారికి జగన్ వల్ల జరిగిన ప్రయోజనాలు, మీడియా, విపక్ష నేతలపై జగన్ కక్షసాధింపు విధానాలు, జారీ చేసిన జీవోలు వంటి పలు అంశాలను ప్రస్తావించారు.
తనపై దాఖలైన కేసులకూ జగన్ బెయిల్ రద్దుకూ సంబంధం లేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు. తనపై దాఖలైన కేసులన్నీ ఎఫ్ ఐఆర్ దశలో ఉన్నాయని, తాను దోషిగా ఎక్కడా నిరూపణ కాలేదని రఘురామ రీజాయిండర్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ రీజాయిండర్ పై అదనపు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టును కోరారు. ఈ క్రమంలోనే గతంలో వాయిదా పడిన విచారణ నేడు జరిగింది.
రఘురామ రీజాయిండర్లపై కౌంటర్ వేస్తామని జగన్ తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. అయితే కౌంటర్ వేయడానికి వీలు లేదని సీబీఐ కోర్టు నిరాకరించింది. డైరెక్ట్‌గా రీజాయిండర్ల వాదనలు వినిపించాలని జగన్ తరఫు న్యాయవాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వాదనలు వినిపించడానికి మధ్యాహ్నం 2.30 వరకు సీబీఐ కోర్టు గడువునిచ్చింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది.