మావాడు మాంచి పొజిషన్ లో ఉన్నాడు.. మమ్మల్ని చూసుకుంటాడు.. అంటూ.. దూరపు చుట్టం గురించి గొప్పగా చెప్పుకునే కుటుంబాలు రెండు తెలుగురాష్ట్రాల్లో చాలానే ఉంటాయి. అలాంటిది.. ముఖ్యమంత్రే సోదరుడు అయినప్పుడు.. అనుకోని రీతిలో ఆ ఇంట్లో హత్య జరిగితే.. నిందితుల్ని ఎంత వేగంగా పట్టుకోవాలి? మరెంత వేగంగా దోషులుగా లెక్క తేల్చాలి? అదేం సిత్రమో.. సొంత బాబాయ్ దారుణంగా హత్యకు గురై రెండేళ్లు అవుతున్నా.. తాను సీఎంగాఏడాదిన్నర దాటినా.. ఇప్పటివరకు కేసు ముందుకు పడకపోవటం ఏమిటి? అన్న సందేహం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది.
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్.. దివంగత మహానేత వైఎస్ కు స్వయాన సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డి తన ఊళ్లో.. తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురి కావటం తెలిసిందే. తొలుత.. బాత్రూంలో కాలు జారి మరణించినట్లుగా ప్రచారం జరిగినా.. తర్వాత దారుణహత్యకు గురైన విషయం బయటకు వచ్చి.. షాకిచ్చింది. నిందితుల్ని పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తును కోరారు నాడు విపక్ష నేతగా ఉన్న జగన్. అనంతరం అక్కర్లేదనుకున్నారు. మొత్తానికి సీబీఐకి ఇచ్చి ఏడాది అవుతున్నా.. ఇప్పటికి అత్తా పత్తా లేని పరిస్థితి.ఇప్పటికే నిందితుడిగా భావిస్తున్న ఒకరు అనుమానాస్పద రీతిలో మరణించారు.
న్యాయం కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా.. ఇప్పటివరకు తనకు న్యాయం లభించలేదని.. ‘న్యాయం కోసం ఎక్కని గడప లేదు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నా. నేనే తగ్గితే సాక్షులు ఎలా వస్తారు? జగన్ ప్రభుత్వమే ఉన్నా జవాబు లేదు.. మా నాన్నది రాజకీయ హత్య.. ఆయన్ను ఎవరు చంపారో తెలియాలి’’ అంటూ వైఎస్ వివేకా కుమార్తె రోదిస్తున్న వైనం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.సమర్థతకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే సీఎం జగన్ హయాంలోనూ.. ఈ దారుణ హత్య చిక్కుముడులు విడవకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. నిజానికి ఇదే సందేహాన్ని సామాన్య ప్రజలే కాదు.. వివేక కుమార్తె కమ్ జగన్ సోదరి సునీత కూడా సంధిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలన్న జగన్.. సీఎం అయ్యాక ఆ అవసరం లేదని వదిలేసినట్లుగా పేర్కొన్నారు.తాను కోర్టులో పిటిషన్ వేసిన తర్వాతే కేసు సీబీఐకి వెళ్లినట్లుగా ఆమె పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికి దోషులు దొరకలేదని.. అందుకే తాను పోరాడుతున్నట్లు ఆమె చెప్పారు. సీఎం తమ సోదరుడే అయినప్పడు.. తన తండ్రి దారుణ హత్యకు కారణమైన వారి కోసం సునీతమ్మ అంతలా కష్టపడాల్సి రావటం ఏమిటి? అన్నది క్వశ్చన్. మరి.. దీనికి జగన్ ఏం సమాధానం ఇస్తారన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.