ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఎపుడూ చర్చనీయాంశమే. ఆయన ఢిలీ వెళ్లిన ప్రతిసారీ దానిపై ఒక మూడు నాలుగు రోజులు చర్చ జరగడం సర్వసాధారణం అయిపోయింది. దీనికి అనేక కారణాలు. ఒకటి… కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం, పోలవరం చిటికెలో పూర్తి చేస్తాం అని ఎన్నికల ముందు చెప్పిన జగన్ సీఎం అయ్యాక… ప్రత్యేక హోదానా? వాళ్లిస్తే తీసుకోవాల్సిందే. ప్లీజ్ సార్ అని ఐదేళ్ల పాటు అడుగుతూనే ఉంటాం అనేశాడు. అంటే వారిచ్చేది లేదు, మనం తీసుకునేదీ లేదు అని చెప్పేశారు.
ఇక కాలానుగుణంగా ఆలస్యం వల్ల పోలవరం ఖర్చు పెరిగింది. దానికి కేంద్రాన్ని కూడా ఒప్పించిన చంద్రబాబు 56 వేలకు కోట్లకు అవినీతి చేయడానికే పెంచుకున్నారు అని చంద్రబాబు మీద ఆరోపించారు. జగన్ మాటనే ప్రాతిపదికగా తీసుకున్న కేంద్రం ఆయన ముఖ్యమంత్రి కాగానే పోలవరం అంచనాలు 20 వేల కోట్లు తగ్గించేసింది. దీనికి కూడా ఇపుడు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటారని చెబుతున్నారు.
అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… జగన్ సీఎం అయ్యాక ఢిల్లీ వెళ్తాడు.. ఏ శాఖతో పని ఉన్నా హోంశాఖనే కలుస్తారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి అవసరం లేని శాఖ అది. ఎందుకంటే హోం శాఖ కీలకమే అయినా దాంతో ముఖ్యమంత్రులకు పని ఉండదు. కానీ జగన్ కి మాత్రం ఆ ఒక్క శాఖతోనే పని … లేకపోతే వెళ్లినపుడల్లా అన్నిటికీ హోంశాఖ మంత్రినే కలవడం ఏంటి? అంటున్నారు విశ్లేషకులు.
ఇక జగన్ ఢిల్లీ వెళ్లేది కేసుల మాఫీ కోసమే అని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. జనం కూడా అదే చర్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక తాజా ఢిల్లీ పర్యటన విషయానికి వస్తే ఇది మునుపటి కంటే కీలకమైనది. గంటకు 7 లక్షల రూపాయలు అద్దె తీసుకునే లెగసీ 650 ఫ్లైట్ ను అద్దెకు తీసుకుని (30 గంటల పాటు) ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి అమిత్ షాను, పలువురు ఇతర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే.
ఆయన పోలవరం గురించి, ఇంకేవో పథకాల గురించి ఢిల్లీ వెళ్లారని ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కానీ ఒక తెలుగు ఎంపీ ద్వారా తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ అమిత్ షాను మూడు కోరికలు కోరారట.
1. రఘురామరాజును తన బెయిల్ పిటిషను విత్ డ్రా చేసుకునేలా చేయమని, తన పార్టీ మీకెపుడూ భేషరుతుగా తోడుగా ఉంటుందని అన్నారట.
2. ఒకవేళ అది కుదరని పక్షంలో కనీసం తన సంతృప్తి కోసమైనా రఘురామరాజుపై తమ పార్టీ కోరినట్లు అనర్హత వేటు వేయమని అడిగారట.
3. ఇవి రెండు చేయలేకపోతే కనీసం ఆర్మీ ఆస్పత్రిలో జరిగిన వ్యవహారంపై రఘురామరాజు ఇచ్చిన కంప్లైంట్ ను చూసీ చూడనట్లు వదిలివేయమని కోరారట.
మరి పోలవరం గురించి అడగలేదా అని అంటారా… అడిగారు అవన్నీ ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది కదా అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. రహస్యంగా జరిగిన చర్చల గురించే ఈ సమాచారం. మరి జగన్ ప్రైవేటు కోరికలు నెరవేరుస్తారా? పబ్లిక్ కోరికలు నెరవేరుస్తారా? లేకపోతే ఇప్పటికే రఘురామరాజు లేఖల ద్వారా జగమెరిగిన అరాచకంతో దోస్తీ చేస్తే పరువు పోతుందని పక్కకెళ్లి పోతారా? అన్నది ఇపుడు అందరి ముందున్న ప్రశ్న.
మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే… ఆ మూడింటిలో ఏ కోరికకు కేంద్ర పెద్దలు తలూపలేదని తెలుస్తోంది. ఇక స్పీకర్ ఓం బిర్లా తో గాని, కేంద్ర రక్షణ శాఖతో గానీ రఘురామరాజుకు సత్సంబంధాలున్న నేపథ్యంలో ఈ కోరికలు తీరే అవకాశాలు బాగా శూన్యం అని చెప్పొచ్చు.