ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేయలేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని, వాటిని గాడిన పెట్టి ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ లో మరో కీలక హామీ అమలుపై సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అంతేకాదు, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతు భరోసా కూడా అమలు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత 16343 డీఎస్సీ పోస్టులను భర్తీ చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు వారికి పోస్టింగులు ఇస్తామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
స్వార్థ ప్రయోజనాలతో ఎన్డీఏ కూటమి ఏర్పడలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేస్తామని మరోసారి క్లారిటీనిచ్చారు.
రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గానికో విజన్ డాక్యుమెంట్ ఇస్తామని, రిసౌర్సెస్ ఇస్తామని, ఆయా ప్రాంతాలను ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డెవలప్ చేసుకోవాలని సూచించారు. స్వర్ణాంధ్ర-2047 పై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగానికి ఈ రోజు సభలో సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు ప్రసంగించారు.