ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గడిచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు పలువురు నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా చేయాలంటూ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇది సరిపోదన్నట్లుగా ఏపీ మంత్రి భరత్ కుమార్ అయితే మరో అడుగు ముందుకేసి.. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా.. లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా పేర్కొనటం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది. ఇలాంటి వేళ.. ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు.. టీజీ భరత్ కు సీరియస్ క్లాస్ పీకటమే కాదు. ఎక్కడకి వచ్చి ఏం మాట్లాడాలో తెలీదా? అంటూ సీరియస్ అయ్యారు. కట్ చేస్తే.. తాజాగా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. తమ్ముళ్లకు దిమ్మ తిరిగే షాకిచ్చేలా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దావోస్ లో ఉన్న ఆయన.. ఇండియా టుడే.. బ్లూమ్ బర్గ్ లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన చంద్రబాబు.. వారసత్వాన్ని ఒక మిథ్యగా అభివర్ణించటం ఒక ఎత్తు అయితే.. లోకేశ్ కు వ్యాపారమైతే చాలా తేలికని పేర్కొనటం గమనార్హం.
ఇంతకూ చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయి. వాటిని ఎవరైనా అందిపుచ్చుకుంటేనే రాణిస్తారు. నేనెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాల మీద ఆధారపడలేదు. 33 ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించాం. ఆ వ్యాపారానికి అయితే లోకేశ్ కు చాలా తేలికైన పని. కానీ.. ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులోసంత్రప్తి పొందుతున్నారు. ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ లో ఐదుసార్లు వరుసగా బీజేపీ గెలిచిందని.. దీంతో డెవలప్ మెంట్.. సంక్షేమం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. నరేంద్ర మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సుస్థిర ప్రభుత్వంతోనే డెవలప్ మెంట్ సాధ్యమవుతుందన్నారు. గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్ తో ఎన్నడూ లేని గెలుపును సాధించామని.. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఏపీలో పరిశ్రమల్ని పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్ని ఒప్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అదానీ విద్యుత్ కాంట్రాక్టులపై చర్యల మాటేమిటి? అని ప్రశ్నించగా..ప్రస్తుతం అమెరికా కోర్టులో ఉందని.. కచ్ఛితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. రాజకీయాలైనా.. వ్యక్తిగత జీవితంలో అయినా విలువలు ఉండాలన్నారు. భారత ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణమన్నారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలో లోకేశ్ మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.