“మా పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. మేమంతా హాజరవుతాం. ఇదొక పండుగ వాతావరణంలో జరుగుతుంది. మహానాడుకు మహా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఒకసారి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకోండి. ఆ కార్యక్రమానికి మించి పోయేలా.. `ఈ కార్యక్రమం` అదిరిపోవాలి. ప్రధాని మోడీ మంత్ర ముగ్ధులవ్వాలి. మళ్లీ మళ్లీ మన దగ్గరకే రావాలి“ అని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వచ్చే నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తర్వాత.. 2015 నుంచి యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిలో ఆయన స్వయంగా పాల్గొం టున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది నిర్వహించే యోగా దినోత్సవానికి ఆయన ఏపీకి రానున్నారు. సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు.. జూన్ 21న నిర్వహించే యోగా దినోత్సవానికి మోడీ ఇక్కడకే వచ్చి.. యోగసానాలు వేయనున్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే టీడీపీ ఘనంగా నిర్వహించే మహానాడు ఏర్పాట్ల గురించి ఆయన అధికారులకు వివరించారు. అదేవిధంగా యోగా కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సుమారు లక్ష మందికి తగ్గకుండా యోగా సాధకులను ఆహ్వానించాలని తెలిపారు. దీనిపై గ్రామ గ్రామాన కూడా అవగాహన కల్పించాలన్నారు.
విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించే యోగా.. ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రదాని మోడీ సహా పలువురు మంత్రులు, విదేశీ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందన్న ఆయన.. ఎక్కడా ఏర్పాట్లలోనూ.. జనాన్ని తరలించే విషయంలో రాజీ ధోరణి వద్దన్నారు. అదేసమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. దీనికి రూ.3-4 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం వెచ్చించనున్నట్టు చెప్పారు.