సీఎం చంద్రబాబు దేశ రాజకీయాలలోకి అడుగుపెట్టబోతున్నారని, ఏపీ సీఎంగా లోకేశ్ ను ప్రమోట్ చేయబోతున్నారని, ఆ క్రమంలోనే ముందుగా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేస్తారని కొద్ది రోజులుగా ముమ్మరంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రచారాన్ని ఇటు టీడీపీ, అటు జనసేన ఖండించాయి. ఈ నేపథ్యంలోనే దావోస్ చంద్రబాబుకు ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది.
కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారని, నాలుగోసారి కూడా అవుతారని చెప్పారు. గుజరాత్ లో బీజేపీ వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చిందని, ఆ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం భారీ స్థాయిలో జరుగుతోందని చంద్రబాబు అన్నారు.
ఇక, జగన్ మళ్లీ సీఎం అవుతారా అన్న ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ఎవరైనే సరే మోసం చేసి ఒకసారి మాత్రమే అధికారంలోకి రాగలరని, ప్రతిసారి రాలేరని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితమైనా విలువలుండాలని అన్నారు. వనరులను లూటీ చేసి డబ్బులు సంపాదించడం దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. జగన్ హయాంలో అదానీ కాంట్రాక్టుల వ్యవహారం అమెరికా కోర్టులో పెండింగ్ లో ఉందని, కచ్చితమైన సమాచారం వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.