సీఎం చంద్రబాబు ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి కంపెనీలు క్యూ డుతున్న సంగతి తెలిసిందే. ఏఐ టెక్నాలజీతో పాటు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన పలు సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీబీఎన్ ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ను అమరావతికి చంద్రబాబు తాజాగా ఆహ్వానించారు. ఏపీలో ఏఐ ఆధారిత అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.
భారత్ ఏఐకి త్వరగా అలవాటుపడిందని, భారతీయుల సృజనాత్మకత అద్భుతమని ఆల్ట్మన్ చేసిన ట్వీట్ కు చంద్రబాబు స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఏఐలో భారత్ దూసుకుపోతోందన్న ఆల్ట్ మన్ వ్యాఖ్యలపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీని ఏఐ అభివృద్ధికి కేంద్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆల్ట్ మన్ కు చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. త్వరలోనే ఆల్ట్ మన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి రావాలని చంద్రబాబు ఇన్వైట్ చేశారు.