ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచారు. ఈ క్రమంలోనే కోనేరు హంపిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు. కోనేరు హంపి విజయం దేశానికే గర్వకారణమని చంద్రబాబు ప్రశంసించారు. 2024.. భారతదేశ చెస్ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఛెస్ ఛాంపియన్ గా నిలిచిన తెలుగు తేజం గుకేశ్ కు కూడా చంద్రబాబు గతంలో అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.
ఇక, తాజాగా ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వీరోచిత సెంచరీ చేసిన సందర్భంగా అతడిని కూడా చంద్రబాబు అభినందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా నితీశ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక, కోనేరు హంపికి మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని, మరిన్ని విజయాలు సాధించి భావితరాలకు హంపి స్ఫూర్తిగా నిలవాలని లోకేశ్ ఆకాంక్షించారు. అంతకుముందు, సెంచరీ హీరో నితీశ్ కుమార్ రెడ్డికి కూడా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.