కాకినాడ సీ పోర్టు వ్యవహారం ఏపీలో పొలిటికల్ రచ్చకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేశారని గతంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో, కాకినాడ పోర్టుకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడ అక్రమ రేషన్ బియ్యం ఉంచిన షిప్ ను సీజ్ చేయించారు. ఈ నేపథ్యంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ఏపీ సీఐడీ విచారణకు ఆదేశించామని పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా మూలాలు మొదలు ఇందులో సూత్రధారుల వరకు అన్ని విషయాలపై విచారణ చేయాలని ఆదేశించామన్నారు.
ఇక, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని నాదెండ్ల ఆదేశించారు. అక్రమ రేషన్ మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. తనిఖీలు, రైడ్ ల కోసం పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. అక్రమ రేషన్ బియ్యం గుర్తించే ల్యాబ్ పరీక్షలు, రిపోర్ట్ లు సత్వరమే వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే