పశ్చిమగోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గం పేరు చెపితే సహజంగానే మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ పేరు గుర్తుకు వస్తుంది. ప్రభాకర్ తన పనితీరుతోనూ, దూకుడుతత్వంతోనూ అంతగా తాను పాపులర్ అవ్వడంతో పాటు దెందులూరు పేరు పాపులర్ చేశారు. గత ఎన్నికల్లో రాజకీయాలకు కొత్త అయిన లండన్‌లో ఉండే కొఠారు అబ్బయ్య చౌదరికి జగన్ సీటు ఇవ్వగా జగన్ వేవ్‌లో అబ్బయ్య చౌదరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఇటు జగన్ భారీ మెజార్టీతో సీఎం అవ్వడం, ఇటు దెందులూరులో అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యే కావడం.. ఇటు ఉన్నత విద్యావంతుడు, అటు సీఎం జగన్‌కు బాగా దోస్త్ అన్న ప్రచారంతో అభివృద్ధిలో దెందులూరు దశ, దిశ మారిపోతుందన్న ఆశలు నిరాశ కావడానికి పెద్దగా టైం కూడా పట్టలేదు.
ఆరు నెలల్లోనే అబ్బయ్య చౌదరికి అభివృద్ధి విషయంలో విజన్ లేదని అర్థమైంది. ఏమాటకు ఆ మాట పదేళ్ల ప్రభాకర్ పాలనలో దెందులూరు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చెందింది. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అంతంత మాత్రమే అభివృద్ధి జరిగింది. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రభాకర్ చాలా వరకు పోరాడి దెందులూరుకు నిధులు రప్పించుకున్నాడు. ఇక 2014లో ప్రభాకర్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం, ఇటు ప్రభుత్వం అధికారంలోకి రావడం, పైగా విప్ పదవి దక్కడంతో పాటు చంద్రబాబు, లోకేష్ దగ్గర మంచి మార్కులు ఉండడంతో నియోజకవర్గానికి కావాల్సినన్ని నిధులు కొల్లగొట్టుకు వచ్చేశాడు.
2014 – 19 మధ్య కాలంలో దెందులూరు చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేంజ్లో అభివృద్ధి జరిగింది. సంక్షేమం కాకుండానే డవలప్మెంట్ పరంగానే రు. 1200 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బయ్య చౌదరి పట్టుమని పదుల కోట్లతో కూడా అభివృద్ధి పనులు చేయలేదు. నియోజకవర్గంలో ఒకటీ అరా రోడ్లు మినహా అభివృద్ధి శూన్యమన్న చర్చలే నియోజకవర్గంలో తరచూ జరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పరంగా దెందులూరు ప్రజానికం తీవ్ర నిరాశతో ఉంది.
నియోజకవర్గంలోని పలు కాలనీలు, పేటలు, దళిత వాడల్లో కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా కరువవుతోన్న పరిస్థితి. గత ఐదేళ్లకు, ఈ ఐదేళ్లకు మధ్య అభివృద్ధినే కంపేరిజన్ చేయాల్సి వస్తే 10 % కూడా జరగలేదనే చెప్పాలి. ఏదేమైనా గత నాలుగున్నరేళ్ల అభివృద్ధి విషయంలో దెందులూరు ప్రజానీకం పూర్తి అసంతృప్తి, అసహనంతో ఉన్న మాట నిజం. ఇప్పుడు దెందులూరులో వైసీపీ వాళ్లు ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఓట్లు అడగడం మినహా తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే పరిస్థితి లేదు.