టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి తాజాగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని పఠాన్ చెరు ప్రాంతంలో కోడి పందేలు జరుగుతున్నాయని, వాటిని చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, బుధవారం రాత్రి ఆ కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేయగా…అక్కడే ఉన్న చింతమనేని పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారట.
దీంతో, చింతమనేని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారట. ఇక, ఆ దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు 100 కోళ్లు, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారట. గత రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు చింతమనేని గురించి ఓ వర్గం మీడియా చేస్తున్న విష..దుష్ప్రచారం ఇది. అయితే, ఇది నిజమా? అన్న ప్రశ్న మాత్రం సదరు మీడియా సంస్థలు నిర్ధారించుకోలేదు. అందుకే, ఈ వ్యవహారంపై తాజాగా చింతమనేని స్వయంగా స్పందించారు.
రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, అసలు కోడి పందేలు జరిగే చోట లేని వ్యక్తిని అక్కడ ఉన్నట్టు చూపించడం కొందరి రాజకీయ జెండా, అజెండా అని చింతమనేని నిప్పులు చెరిగారు. తనపై నీచమైన ప్రచారాలు చేస్తూ, గాలి మేడలు కట్టి, ఉత్త పుకార్లు పుట్టించి కట్టి అధికారంలోకి వచ్చారని జగన్ ను ఉద్దేశించి దుయ్యబట్టారు. అంతేకాదు, ఆ మేడలు కూలిపోయే సమయం ఆసన్నమైందని, ఆ అసత్యాల ‘సాక్షి’ని ప్రక్షాళన చేసే సమయం వచ్చిందని చెప్పారు. ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా? అని చింతమనేని నిలదీశారు. మీ రాక్షస రాజకీయాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని వార్నింగ్ ఇచ్చారు.