“జగన్.. నువ్వేదో అనుకుంటున్నావ్.. నన్నేదో గేలి చేస్తున్నావ్. నీ సొంత చిన్నాన్న వివేకా హత్య వెనుక నేనున్నానంటున్నావ్. నీ ఇద్దరు చెల్లెళ్లను నేను మేనేజ్ చేశానని చెబుతున్నావ్. నువ్వు అనుకుంటున్న ట్టు ఏదీ జరగదు. జగన్.. నీ బతుకు చాలా భయంకరంగా మారుతుంది.. ఈ ఎన్నికలు కానీ.. ఆ తర్వాత నీ బతుకును చూసి నువ్వే తట్టుకోలేవ్“ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
`ప్రజాగళం` పేరుతో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన సీఎం జగన్ తనపై చేసిన విమర్శలకు అదే రేంజ్లో సమాధానం చెప్పారు. వివేకా హత్య వెనుక తాను ఉన్నానంటూ.. జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు. ఇద్దరు చెల్లెళ్లకు న్యాయం చేయలేని జగన్.. రాష్ట్రానికి ఇంకేం న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. సునీత, షర్మిలను తాను మేనేజ్ చేస్తున్నానంటూ.. జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా బాబు తిప్పికొట్టారు.
“తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నాను… తిరిగి నాపైనే కేసులు పెడతావా? అని ఆ అమ్మాయి(సునీత) అడిగింది. ఆ హత్య ఎవరు చేయించారో హంతకుడు(అప్రూవర్‌గా మారిన దస్తగిరి) స్పష్టంగా చెప్పాడు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని ఓటు వేయమని అడుగుతున్నావు. నీకు మనసెలా ఒప్పింది? బంధుత్వానికి, ప్రేమకు ఇదేనా నువ్వు ఇచ్చే విలువ? అని ఆ అమ్మాయి అడిగింది. ముందు దీనికి సమాధానం చెప్పు జగన్. నువ్వు సైకో అనుకున్నా.. కాదు.. నువ్వు క్రిమినల్వి“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
“నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు… నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పి, ఆ తర్వాతే ప్రజలను ఓటు అడగాలి. నిందితుడు ఎవరో సీబీఐ కూడా చెప్పింది. అరెస్ట్ చేయనివ్వకుండా అడ్డుకుని అతడ్ని కాపాడారు. వేరేవాళ్లపై అభాం డాలు వేసి బతికిపోవాలనుకుంటున్నారు… ఈ ఆటలు సాగవు. ఎన్నికలు పూర్తయ్యాక.. నీ బతుకు చాలా భయంకరంగా మారుతుంది. దానిని చూసి తట్టు కోలేవ్ జగన్“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.