విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను టీడీపీ, నందమూరి అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 28 నాటికి ఈ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు విజయవాడలోని పోరంకిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తలైవా రజనీకాంత్ హాజరు కాబోతున్నారు.
అన్నగారు అసెంబ్లీ ప్రసంగాలను వీడియో, పుస్తక రూపంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై వాటిని ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తేనేటి విందునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకాంత్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. తలైవాతో కాసేపు చంద్రబాబు భేటీ అయ్యారు.
ఈ తేనీటి విందులో నందమూరి బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పలువురు, టీడీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు, ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్ కు బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు.