ఏపీలో తమ పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్ సంఘాలు పలుమార్లు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ బిల్లులు చెల్లించాలంటూ గతంలో గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు మౌన నిరసన ప్రదర్శన కూడా చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించే కాంట్రాక్టర్లు కూడా భాగమేనని, ఆనాడు ఉపాధి కల్పించిన తాము ఈనాడు బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నామని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న మా బిల్లులు చెల్లించండి…మా ప్రాణాలు కాపాడండి….అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో, తామంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో కాంట్రాక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని, బ్యాంకుల దగ్గర వడ్డీకి అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసినా బిల్లులు రాలేదని అంటున్నారు. గతంలో ఏపీలో ఎన్నడూ లేనంత అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కాంట్రాక్టర్లున్నారని, సీఎం జగన్ తమ సమస్యను తక్షణమే పరిష్కరించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని దీనంగా వేడుకుంటున్నారు. అయినా సరే…కాంట్రాక్టర్లపై మాత్రం జగన్ కరుణించడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు కాక… క్యాన్సర్ బాధితుడైన తన తండ్రి వైద్యానికి డబ్బులు లేక ఓ కాంట్రాక్టర్ పడుతున్న ఆవేదన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ పాలనలో దుస్థితిపై స్పందించిన చంద్రబాబు..ఆ కాంట్రాక్టర్ వెంకట శివప్ప బాధను పంచుకున్నారు. ఓ పక్క కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని, రాష్ట్ర ఆదాయం గాడిన పడిందని చెబుతున్న జగన్..ఒకటో తారీకు వచ్చి వారం రోజులైనా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంలో ఆసుపత్రికి వెళ్తున్న పసిబిడ్డ గుంతల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర పాలనా దుస్థితికి ఇవన్నీ ఉదాహరణలని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో చెప్పడానికి ఇవి నిదర్శనమని అన్నారు. ప్రజలను బాదేస్తున్న పన్నులు ఎటు పోతున్నాయి? లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.